TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ తెలంగాణ దీక్షపై నేతల రెస్పాన్స్

Published on: Mon Jan 9, 2012 1:39PM

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో రేపటి నుంచి 48 గంటల పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ రైతు దీక్షపై తెలంగాణ నాయకులు దండెత్తుతున్నారు.జగన్ రైతు దీక్షకు వ్యతిరేకంగా ఆర్మూరులో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా పాల్గొన్నారు. జగన్ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.  తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తేనే జగన్‌ను తెలంగాణలో పర్యటించేందుకు అనుమతిస్తామని కోదండరామ్ అన్నారు. జగన్ తెలంగాణ వ్యతిరేకి అని ఆయన విమర్శించారు.  చంద్రబాబును అడ్డుకున్నట్లే జగన్‌ను అడ్డుకుంటామని ఆయన చెప్పారు.

జగన్ పర్యటనను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జగన్ తెలంగాణ వ్యతిరేకి అని, పార్లమెంటులో తెలంగాణకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారని ఆయన కరీంనగర్‌లో విమర్శించారు. కార్పొరేట్ వ్యాపారం తెలిసిన జగన్ రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు అనుకూలమని వైయస్ జగన్ కేంద్ర హోం మంత్రి చిదంబరానికి లేఖ ఇవ్వాలని, అప్పుడే తెలంగాణలో జగన్ పర్యటనను అడ్డుకోబోమని కాంగ్రెసు మరో తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ అన్నారు. సమైక్యవాదుల కుట్రలో భాగంగానే జగన్ తెలంగాణ పర్యటనకు పూనుకున్నారని ఆయన నిజామాబాద్‌లో అన్నారు.  జగన్ తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.కాగా చంద్రబాబు పోరు బాట, జగన్ దీక్షలు రాజకీయ ప్రయోజనం కోసమేనని తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానా రెడ్డి తన కృష్ణా జిల్లా పర్యటనలో అన్నారు. తమ రాజకీయం తాము చేస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఆగిపోలేదని ఆయన అన్నారు.