ఫుట్ బాల్ అభిమానులుగా వచ్చి పేల్చుకున్న ఉగ్రవాదులు ౩౦ మంది దుర్మరణం

 

 

ఉగ్రవాదానికి ప్రాంతం మతం అనే తేడా లేని విషయం తెలిసిందే. తాజాగా నైజీరియాలో ఓ ఫుట్ బాల్ మ్యాచ్ లో  నరమేధం జరిగింది. బోకోహరాం ఉగ్రవాదులు ఫుట్ బాల్ మ్యాచ్ ను చూస్తున్న క్రీడాభిమానులపై ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 30 మంది ఫుట్ బాల్ ప్రేమికులు ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది గాయాలపాలయ్యారు. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దారుణం జరిగింది. కొండుగ అనే ప్రాంతంలో కొందరు ఫుట్ బాల్ అభిమానులు వీడియో థియేటర్ లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా, ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్ తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్ ను చూస్తున్న ప్రేక్షకుల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మొదట 9 మంది ఘటనస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, అంబులెన్స్ లు రాక  ఆలస్యం కావడంతో మరో 21 మంది కన్ను మూశారు . ఈ దారుణం బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది.