మళ్లీ కోవిడ్ నాటి పరిస్థితులు? విమానాశ్రయాల్లో స్క్రీనింగ్.. ఎందుకంటే?
Published on: Wed Jan 28, 2026 10:10AM

ఇండియాలో మళ్లీ కోవిడ్ పరిస్థితులు రానున్నాయా? భౌతిక దూరం, ప్రయాణాలపై ఆంక్షలు మరోసారి అనుభవంలోకి రానున్నాయా? అంటే పరిస్థితిని బట్టి అవుననే సమాధానమే వచ్చేలా ఉంది. ఈ సారి నిఫా వైరస్ విస్తరణ బెంబేలెత్తిసతోంది. దేశంలో నిఫా వైరస్ వేగంగా విస్తరిస్తోందని కేంద్రం తెలిపింది. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాలలో నిఫా వైరస్ కేసులు వెలుగులోకి వచ్చాయి. పశ్చిమ బెంగాల్ లో ఐదు నిఫావైరస్ కేసులు ఉన్నట్లు ధృవీకరించారు.
ఈ వైరస్ సోకిన వారిలో హెల్త్ వర్కర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఇలా ఉండగా నిఫా వైరస్ సోకిన వారితో కాంటాక్ట్ ఉన్న దాదాపు రెండు వందల మందిని హోం క్వారంటైన్ చేశారు. మరో రెండు మూడు వందల మందిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే కేరళలో కూడా నిఫావైరస్ వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉందని చెబుతున్నారు.
నిఫా వైరస్ కారణంగా విమానాశ్రయాలలో స్క్రీనింగ్ ప్రారంభమైంది. ముఖ్యంగా థాయిలాండ్, నేపాల్, తైవాన్ ల నుంచి వచ్చే ప్రయాణీకులకు టెంపరేచర్ స్క్రీనింగ్ చేస్తున్నారు. నిఫా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారిని వెంటనే క్వారంటైన్ కు తరలిస్తున్నారు.
అలాగే విదేశాలలోని విమానాశ్రయాలలో కూడా ఇండియా నుంచి వచ్చే ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా కోల్‌కతా నుంచి వచ్చే వారిని క్షుణ్ణంగా పరీక్షించి మరీ అనుమతిస్తున్నారు. నిపా వైరస్ ప్రాణాంతక వైరస్, ఇది మనుషుల నుంచి మనుషులకు వేగంగా సోకుతుంది. దీనికి ఇప్పటి వరకూ ఎటువంటి వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ కూడా గబ్బిలాల నుంచి మానవులకు వ్యాపిస్తుంది.


