TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ మోటార్ సైకిలిస్ట్ ప్రాణత్యాగం..ఎందరికో స్పూర్తి

Published on: Sat Jul 16, 2016 3:00PM

జాతీయ దినోత్సవాల్లో జరుగుతున్న వేళ ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో జరిగిన మారణకాండ ప్రపంచాన్ని కలవరపరిచింది. బ్యాస్టిల్ డే ఉత్సవాల్లో భాగంగా ప్రజలు బాణాసంచా పేలుళ్లను తిలకిస్తుండగా ఒక ఉగ్రవాది ట్రక్కును వేగంగా నడుపుతూ వారిపైకి ఎక్కించాడు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర ప్రజలను తొక్కించుకుంటూ వెళ్లాడు. ఈ మారణకాండలో పది మంది ఉగ్రవాదులు సహా 84 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మృత్యు శకటం నుంచి తప్పించుకునేందుకు ప్రజలంతా తలొదిక్కుకు పారిపోయారు.

 

కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఆ ఆగంతకుడి నుంచి తోటి వారిని రక్షించేందుకు రంగంలోకి దూకినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ ప్రయత్నంలో ఒకరు మరణించినా..మరోకరు మాత్రం ఉగ్రవాదితో తలపడి పోలీసులు ఆ కిరాతకుడిని హతమార్చడంతో తోడ్పడ్డాడు. పిచ్చిపట్టిన వాడిలా ట్రక్కును నడుపుతూ ప్రజల ప్రాణాలు తీస్తుండటాన్ని గమనించిన ఒక వ్యక్తి జరగబోయే దానిని ఊహించాడు. వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మోటార్ సైకిల్‌పై ట్రక్కును వెంబడించాడు. ట్రక్కును ఓవర్‌టేక్ చేసి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్కు డ్రైవర్ తలుపుతీసి కేబిన్‌లోకి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ ఆ ప్రయత్నంలో కిందపడిపోయి ట్రక్కు చక్రాల కిందపడి నలిగిపోయి చనిపోయాడు.

 

మరోక వ్యక్తి ట్రక్కులోకి దూకి..దానిని నడుపుతున్న ఉగ్రవాదితో కలబడ్డాడు. అతడి వద్ద ఉన్న తుపాకీని లాక్కొన్నాడు. ఈ ఘర్షణలో ట్రక్కు కొంతసేపు ఆగటంతో ఇద్దరు పోలీసులు అక్కడికి చేరుకుని..ఉగ్రవాదిని కాల్చి చంపటానికి సమయం లభించింది. వీరిద్దరి వీరోచిత పోరాటంతో మారణహోమం ఎక్కువసేపు సాగలేదు. లేదంటే మరింత ప్రాణనష్టం సంభవించేది. ఇపుడు ఆ మోటార్ సైకిలిస్ట్ ప్రజల గుండెల్లో హీరోగా నిలిచాడు. అతనికి దేశమంతా నివాళులర్పిస్తోంది.