TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోడికత్తి కేసు వాయిదాకు జగన్ గైర్హాజర్.. విచారణ వాయిదా!

Published on: Wed Mar 8, 2023 6:42AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో  మంగళవారం (మార్చి 7)  జరిగింది.  అయితే కోర్టు గత విచారణ సందర్భంగా విస్పష్టంగా ఆదేశించినా ఈ కేసులో బాధితుడు జగన్  హాజరు కాకపోవడంతో విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. ఈ సందర్భంగా బాధితుడు జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని మరో మారు ఆదేశించింది. గత జనవరి 31న ఈ కేసు ఎన్ఐఏ కోర్టు ముందకు విచారణకు రాగా అప్పుడు కూడా జగన్ హాజరుపై కోర్టు ఆదేశాలు జారీ చేసింది.   తదుపరి విచారణకు ఈ కేసులో బాధితుడిగా ఉన్న ఏపీ సీఎం జగన్ ను కూడా హాజరుపరచాలని ఎన్ఐఏను ఆదేశించింది.

అసలు కేసు వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం విమానాశ్రమంలో 2018 అక్టోబర్ 25న అప్పటి విపక్ష నేత జగన్ పై కోడికత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేశాడు. 2019 ఎన్నికల ముందు జరిగిన ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర ఉందన్నంతగా భూతద్దంలో చూపి కేసును ఎన్ఐఏకి అప్పగించారు. ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. కోడి కత్తి శీనును అరెస్టు చేసింది.   ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తు చేస్తోంది.  2019 ఆగస్టు 13న ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది.  కేసు విచారణలో భాగంగా ఏపీ సిఎం జగన్మోహన్‌ రెడ్డి కోర్టు విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు మంగళవారం (జనవరి 31) ఆదేశించింది.  అలాగే   ఈ కేసులో తొలి సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్ పోర్ట్ అసిస్టెంట్ కమాండెంట్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనను కూడా హాజరు పరచాలని ఆదేశించింది. అలాగే ఈ కేసులో 3వ సాక్షిగా ఉన్న జగన్ పీఏ నాగేశ్వరరెడ్డి కూడా హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గత విచారణలో కూడా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసులో విజయవాడ ఎన్ఐఏ కోర్టు   ఈ కేసులో బాధితుడుగా ఉన్న సీఎం (అప్పటి ప్రతిపక్ష నేత)జగన ను ఎందుకు ప్రశ్నించలేదని  ఎన్ఐఏ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.  

బాధితుడిని ప్రశ్నించకుండా మిగిలినివారిని ప్రశ్నించి విచారించి ఏం లాభం? అంటూ వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడితో పాటు సీఎం జగన్ విచారణకు హాజరైన తరువాతే ట్రయల్ నిర్వహిస్తామని స్పష్టంచేసింది. 

కోడికత్తి కేసులో తనపై చేసిన దాడిలో నిందితులకు శిక్ష పడాలంటే జగన్ కోర్టుకు హాజరు కావాలి. అయితే జగన్ మాత్రం ఈ కేసులో బాధితుడిగా   కోర్టుకు వెళ్లడం లేదు. ఎన్ ఐఏ కోర్టులో కోడి కత్తి కేసు విచారణకు వచ్చిన ప్రతి సారీ  బాధితుడు హాజరు కావాలని న్యాయమూర్తి ఆదేశిస్తున్నారు. అయినా జగన్ ఖాతరు చేయడం లేదు.తాజాగా మంగళవారం (మార్చి 7) జరిగిన విచారణకు కూడా సీఎం జగన్ హాజరు కాలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్ పై విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి ఘటనపై విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగుతోంది. ఈ ఘటన జరిగి నాలుగేళ్లు దాటిపోయింది.  చార్జిషీటు దాఖలు అయ్యింది. ప్రతీ వాయిదాకు   నిందితుడు శ్రీనివాసరావును పోలీసులు హాజరు పరుస్తున్నారు. ప్రత్యక్ష సాక్షి అయిన సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ కూడా ఈ సారి హాజరయ్యారు. ఆయనను కోర్టు ప్రశ్నించి వివరాలు తెలుసుకుంది. మరోసారి బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని ఆదేశిస్తూ ఎన్ఐఏ కోర్టు..తదుపరి విచారణ ఈనెల 14కు వాయిదా వేసింది.

బాధితుడు కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇస్తే తప్ప విచారణ ముందుకు సాగదు. ఈ కేసులో నిందితుడిగా నాలుగేళ్లుగా కటకటాల వెనుక ఉన్న నిందితుడికి కనీసం బెయిలు కూడా రాదు. ఎందుకంటే..ఇది ఎన్ఐఏ కేసు.. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్ పై దాడి వెనుక ఉగ్ర కుట్ర ఉందంటూ.. ఈ కేసు విచారణ ఎన్ఐఏకు అప్పగించారు.  ఇక తాజా విచారణలో అప్పట్లో జగన్ పై దాడికి ఉపయోగించిన  కోడి కత్తి గురించి సైతం ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి ఆరా తీశారు. దానిని తమ ముందు ప్రవేశ పెట్టాలని దర్యాప్తు అధికారుల్ని ఆదేశించారు. ఈ కేసులో బాధితుడైన జగన్  కోర్టుకు హాజరై.., జరిగిందేమిటో వాంగ్మూలం ఇస్తేనే కేసు విచారణ  కొలిక్కి వస్తుందంటున్నారు. మరి తనపై దాడి చేసిన వ్యక్తికి శిక్ష పడేలా చేయడానికైనా జగన్ కోర్టుకు రావాల్సి ఉంటుంది. తాను నిందితుడిగా ఉన్న కేసులలో హాజరుపై మినహాయింపు కోరుతున్న జగన్ తాను బాధితుడిగా ఉన్న కేసులోనూ కోర్టుకు హాజరు కావడానికి ఎందుకు సుముఖంగా లేరన్నది ఆయనే చెప్పాల్సి ఉంది. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్ర‌మ్మ గత ఏడాది జులైలో అప్పటి సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌కు తన కుమారుడిని విడుదల చేయాలంటూ లేఖ రాశారు. నాలుగు సంవ‌త్స‌రాల నుంచి త‌న కుమారుడు రిమాండ్ ఖైదీగానే ఉన్నాడనీ, ఈ కేసుకు సంబంధించి ఎన్ఐఏకానీ, న్యాయ‌స్థానం కానీ  విచార‌ణ జ‌ర‌ప‌డంలేద‌ని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.