మోదీ హత్యకు 20 మంది స్లీపర్ సెల్స్!.. NIA అలర్ట్..
Published on: Fri Apr 1, 2022 3:56PM
ఉగ్రవాదుల మెయిన్ టార్గెట్ పీఎం మోదీనే. ఎప్పటి నుంచో ఆయన టెర్రరిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్నారు. కశ్మీర్‌లో ముష్కర మూకలపై ఉక్కుపాదం, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదులు, పాకిస్తాన్ సైతాన్‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరో ముంబై తరహా మారణహోమంతో పాటు మోదీని టార్గెట్ చేసుకొన్నారు. అందుకే, ప్రధాని సెక్యూరిటీ నిత్యం అత్యంత అప్రమత్తంగా ఉంటుంది. టైట్ ప్రొటెక్షన్ ఉండే పీఎంను టచ్ చేయడం అంత ఈజీ కానే కాదు.
అలాంటిది, తాజాగా ప్రధాని మోదీని హతమారుస్తామని బెదిరిస్తూ ఓ ఆగంతుకుడు జాతీయ దర్యాప్తు సంస్థ- NIAకు ఈ-మెయిల్ పంపించాడు. అలాగే దేశవ్యాప్తంగా వేల మందిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు మెయిల్‌లో రాసుకొచ్చాడు. ఎన్‌ఐఏ ముంబయి బ్రాంచ్‌కు ఈ ఈ-మెయిల్ వచ్చింది.
పీఎం మోదీని హత్య చేసేందుకు 20 మంది స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నారని ఆ ఈ-మెయిల్‌లో ఉంది. వారి దగ్గర 20 కేజీల ఆర్‌డీఎక్స్ ఉందని.. దేశవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నామని.. వివిధ ఉగ్రవాద గ్రూపులు ఇందుకోసం పనిచేస్తున్నాయని ఈ-మెయిల్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
ఈ-మెయిల్ ఏ ఐపీ అడ్రస్ నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగం రంగంలోకి దిగింది. మరోవైపు, ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా.. ఆ ఈ-మెయిల్ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న భద్రతా ఏజెన్సీలను, దర్యాప్తు సంస్థలను అప్రమత్తం చేసింది ఎన్‌ఐఏ.


