జైలుకు పంపుతాం.. ఏపీ సీఎస్ కు ఎన్జీటీ వార్నింగ్
Published on: Fri Jun 25, 2021 3:54PM
తెలుగు రాష్ట్రాల మధ్య రాయలసీమ ఎత్తిపోతల పథకంపై యుద్ధం సాగుతుండగానే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే తెలంగాణ సర్కార్ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు.. ప్రాజెక్టు పనులు ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు పాటించకపోతే జైలుకు పంపిస్తామంటూ ఏపీ సీఎస్ కు వార్నింగ్ ఇచ్చింది.
ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకు వెళ్లకూడదని గతంలో ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేపడుతున్నారని తెలంగాణ సామాజిక కార్యకర్త గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై విచారణ జరిగింది.
ఏపీ ప్రభుత్వంపై ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు, చెన్నైలోని కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చేనెల 12కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.


