ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై ఎన్జీటీకి చేరిన నివేదిక.. నిర్లక్ష్యం వల్లే ప్రమాదం!

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీకేజీ ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ తన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ) కి సమర్పించింది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నివేదిక రూపంలో కమిటీ సమర్పించింది. సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొంది. మానవ తప్పిదం, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో తెలిపింది. 

ముఖ్యంగా, ఐదు కీలక తప్పిదాలను కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. "అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టైరీన్ పాలిమరైజేషన్ ను నిలువరించే టీబీసీ స్టోరేజి తగినంతగా ప్లాంట్ లో అందుబాటులో లేదు. ప్లాంట్ లో ఆక్సిజన్ ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ ను అమలు చేయడంలేదు.  స్టైరీన్ స్టోరేజి ట్యాంకు టాప్ లేయర్లలో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడంలేదు. ప్లాంట్ లో రిఫ్రిజరేషన్ వ్యవస్థను 24 గంటల పాటు ఆపరేట్ చేయడంలేదు. ప్లాంట్ లోనూ, స్టోరేజి ట్యాంకు వద్ద పర్సన్ ఇన్ చార్జిల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్టంగా ఉంది." అని నివేదికలో పేర్కొంది.

కాగా, విచారణ కమిటీ నివేదికపై అభ్యంతరాలుంటే 24 గంటల్లో తెలపాలని ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్‌జీటీ స్పష్టం చేసింది. నివేదిక పరిశీలించి లిఖితపూర్వక ఆదేశాలు ఇస్తామని ఎన్‌జీటీ అధికారులు వెల్లడించారు. ఈ రెండు రోజుల్లో ఎన్‌జీటీ తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.