రూ.50 కోట్లకు శఠగోపం పెట్టిన న్యూవిజన్ ఫౌండేషన్
Published on: Wed Feb 15, 2012 3:30PM
చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మనీ స్కీమ్ స్కామ్
ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు: న్యూ విజన్ ఫౌండేషన్ అనే సంస్థ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీం పేరుతో ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు జిల్లాల్లో పేద ప్రజలను రూ.50 కోట్ల మేర మోసగించింది. కోట్లాది రూపాయలు నష్టపోయి బాధితులు ఒకవైపు లబోదిబో మంటుంటే మరో వైపు న్యూవిజన్ ఫౌండేషన్ అక్రమార్కులను కాపాడటానికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ నాయకులు మనపాటి రవీంద్ర తీవ్రంగా కృషిచేస్తున్నట్లు తెలిసింది.గతంలో రవీంద్ర గూడూరు నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిగా పోటీచేసి పరాజయం పాలయ్యాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నాడు. న్యూవిజన్ ఫౌండేషన్ సంస్థ చైర్మన్ రఘురాంకు నెల్లూరు జిల్లాలోని ప్రముఖ కాంగ్రెస్ నాయకుల అండదండలున్నాయి. దీనితో మనపాటి రవీంద్ర నిందితుల్ని కాపాడటానికి బహిరంగంగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. న్యూవిజన్ ఫౌండేషన్ నుంచి మనపాటి రవీంద్ర పెద్దమొత్తంలో డబ్బును పొందాడని, అతను ఇప్పుడు బాధితులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని న్యూవిజన్ ఫౌండేషన్ సలహాదారు నేహేమియా అనే అతను ఆరోపిస్తున్నాడు.


