మమత దెబ్బకు దిగివచ్చిన మన్మోహన్ సింగ్
Published on: Tue Mar 20, 2012 12:06PM
న్యూ
ఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యుపిఏ సంకీర్ణ సర్కారులో చేరేందుకు నిరాకరించటంతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కాళ్లబేరానికి రాక తప్పలేదు. మమతా బెనర్జీ ఆదేశించిన విధంగా రైల్వే శాఖ మంత్రి దినేష్ త్రివేది ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించి రాష్టప్రతికి పంపించారు. అంతటితో ఆగకుండా మమత సూచించిన విధంగా కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి ముకుల్ రాయ్‌ను కేబినెట్ మంత్రిగా పదోన్నతి ఇవ్వటంతోపాటు, ఆయనకు రైల్వే శాఖను కేటాయించేందుకు అంగీకరించారు.
ముకుల్‌రాయ్ మంగళవారం ఉదయం పది గంటలకు రాష్టప్రతి భవన్‌లో కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మమతా బెనర్జీ సోమవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమై తాజా వివాదంపై చర్చించారు. దినేష్ త్రివేది రాజీనామా ఆమోదించటంతోపాటు పెంచిన రైల్వే చార్జీలు తగ్గించాలని ఈ సందర్భంగా మమత డిమాండ్ చేశారు. తరువాత ఆమె తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ముకుల్ రాయ్ కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. అయితే ముకుల్‌రాయ్ ప్రస్తుతం నిర్వహిస్తున్న షిప్పింగ్ శాఖను ఎవరికి కేటాయిస్తారనేది చెప్పేందుకు ఆమె నిరాకరించారు. రాజీనామా చేసిన దినేష్ త్రివేది స్థానంలో ఎవరిని కేబినెట్‌లోకి తీసుకుంటున్నారనేది వెల్లడించేందుకు కూడా మమతా బెనర్జీ అంగీకరించలేదు.


