ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా దీక్ష జగన్
Published on: Mon Feb 13, 2012 9:10AM
అనంత
పురం: చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడానికి ధర్మవరంలో మూడు రోజుల పాటు 48 గంటల నిరాహార దీక్ష చేస్తానని వారికి మాటయిచ్చానని, అందుకే దీక్ష చేట్టానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం అన్నారు. ఆయన సాయంత్రం అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో మూడు రోజుల నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ దీక్షతో ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరిగేలా దీక్ష చేద్దామన్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కేటాయించిన మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ఎందుకు విడుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. ధర్మవరం పట్టుచీరలు ఒక్క మన రాష్ట్రంలోనే కాదని దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చందిన చీరలన్నారు. ఇంతటి ప్రసిద్ధి కెక్కిన ధర్మవరంలో గత కొద్దికాలంగా చేనేత కార్మికుల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందన్నారు. గత ఒక్క సంవత్సరంలోనే ధర్మవరం పట్టణంలో 17 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేతన్నలను ఆదుకునేందుకు ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్సు పక్కన పెట్టడం వల్ల విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


