TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2జి స్కాం:రంగంలోకి మన్మోహన్!

Published on: Fri Feb 10, 2012 9:32AM

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 2-జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఎనిమిది సంస్థలకు ఇచ్చిన 122 లైసెన్స్‌లను రద్దు చేయటంతో ఉత్పన్నమైన సమస్యను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రంగప్రవేశం చేశారు. లైసెన్స్‌ల రద్దుతో నార్వే, అరబ్ దేశాలకు చెందిన టెలికాం సంస్థలు మన దేశంలో తమ తమ కార్యాలయాలను మూసివేయటంతోపాటు పెట్టుబడులను ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. దీనితో పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న మన్మోహన్, లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, టెలికాం మంత్రి కపిల్ సిబల్, న్యాయ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్‌తో వచ్చే వారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. విదేశీ టెలికాం సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణకు పూనుకోకుండా ఉండేలా తీసుకోవలసిన చర్యల గురించి చర్చించి టెలికాం రంగానికి సంబంధించిన కొత్త విధానాన్ని రూపొందించేందుకే ఈ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. ఎనిమిది సంస్థలకు ఇచ్చిన 122 లైసెన్స్‌లను సుప్రీంకోర్టు రద్దు చేయటంతో దేశంలోని టెలికాం రంగంలో గందరగోళం నెలకొనింది. ఎనిమిది కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే దేశానికి ఆర్థికపరంగా బాగా నష్టం కలుగుతుందని ప్రధాని భావిస్తున్నారు. విదేశీ సంస్థలు దేశం విడిచిపోతే మన విశ్వసనీయతకు కూడా దెబ్బ తగులుతుందని ఆందోళన చెందుతున్నారు. ఇలావుంటే, ప్రధాని అధ్యక్షతన జరిగే ముగ్గురు మంత్రుల సమావేశంలో 2-జి స్పెక్ట్రమ్ వేలం తదితర అంశాలతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూసేందుకు తీసుకోవలసిన చర్యల గురించి కూడా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.