మైనింగ్ మాఫియాపై సీఈసీ కొరడా..తవ్వకాలు నిజమే
Published on: Tue Feb 7, 2012 8:55AM
న్యూ
ఢిల్లీ: కర్ణాటక మైనింగ్ మాఫియాపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) కొరడా ఝళిపించింది. బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు జరిగాయని సాధికారిక కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు తుది నివేదికను అందజేసింది. కర్ణాటక రాష్ట్రంలో అక్రమాలకు పాల్పడిన 49 మైనింగ్ లీజులను రద్దు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఈ లీజులపై విచారణ జరపాలని సూచించింది. మరో 72 లీజుదారులకు భారీ జరిమానాలు విధించింది. జరిమానా చెల్లిస్తే గనులు తవ్వుకోవచ్చని సూచించింది. మరో 45 మైనింగ్ లీజుల్లో తప్పు చేయలేదని, అవి తిరిగి మైనింగ్ జరుపుకోవడానికి అనుమ తించాలని సిఫారసు చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దులు స్పష్టంగా నిర్ధారణ కానంత వరకూ అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో గాలి జనార్దన రెడ్డికి చెందిన ఏడు మైనింగ్ లీజుల్లో తవ్వకాలపై నిషేధం కొనసాగించాలని సిఫారసు చేసింది.
ఆయనకే చెందిన దక్కన్ మైనింగ్ సిండికేట్‌కు సంబంధించిన గనుల్లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు, కోర్టు విచారణకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బళ్లారి జిల్లాలో గనులను అక్రమంగా తవ్వేస్తున్నారని సమాజ పరివర్తన సముదాయం సంచాలకుడు ఎస్ఆర్ హీరేమఠ్ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో, జాయింట్ సర్వే ద్వారా బళ్లారి జిల్లాలోని గనుల ప్రాంతాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని గత ఏడాది మే 6న సీఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ బృందం బళ్లారి, తుముకూరు, చిత్రదుర్గల్లోని 166 మైనింగ్ లీజులను సర్వే చేసింది. వాటిలో 123 మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారించింది. వీటిలో 83 బళ్లారిలోనే ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో 1723.63 హెక్టార్లలో అక్రమాలు జరిగాయని, ఇందులో 1214.67 హెక్టార్లు బళ్లారిలోనే ఉన్నాయని తేల్చి చెప్పింది. ఈ మేరకు 143 పేజీల నివేదికను సుప్రీం కోర్టుకు అందజేసింది.
సుప్రీంకోర్టు అనుమతులు లేకుండా బళ్లారి రక్షిత అటవీ ప్రాంతంలో మైనింగ్ లైసెన్సులు ఇక నుండి జారీ చేయవద్దని తెలిపింది. కేవలం 16 కంపెనీలకు మాత్రమే మైనింగ్ చేసుకునేందుకు అనుమతినివ్వవచ్చని తెలిపింది. ఈ మూడు జిల్లాల్లో మైనింగ్ కోసం బిడ్ వేస్తే సుమారు రూ. 50వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వస్తాయని, భారీ ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశముందన్నారు.


