2జి స్కాం ఉత్కంఠకు తెర..తప్పించుకున్న చిదంబరం
Published on: Sat Feb 4, 2012 1:19PM
న్
యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కేంద్రం హోంమంత్రి చిదంబరానికి ఊరట లభించింది. 2జీ కేసులో చిదంబరాన్ని కూడా సహ నిందితుడిగా చేర్చాలని కోరుతూ జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటీషన్ ను ప్రత్యేక కోర్టు కొట్టి వేసింది. దేశ వ్యాప్తంగా నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది. సుబ్రహ్మణ్య స్వామిని ఏకాంతంగా కోర్టు హాలులోకి అనుమతించిన న్యాయమూర్తి తన తీర్పును ఇన్ కెమేరాలో వినిపించారు. పాటియాలా హౌస్ కోర్టులోకి మీడియా ప్రతినిధులను అనుతించలేదు. చిదంబరంపై కోర్టు వెలువరించే తీర్పు కోసం కోర్టు వెలుపల పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు తదితరులు గుమికూడారు.
సుబ్రహ్మణ్య స్వామిని కూడా కోర్టు హాల్లోకి అనుమతించారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, కోర్టు ముందు చిదంబరం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని, చిదంబరానికి వ్యతిరేకంగా తాను అన్ని పత్రాలు సమర్పించానని, దాదాపు 2 వేల పేజీల పత్రాలు సమర్పించానని, న్యాయం జరుగుతుందనే విశ్వాసం తనకు ఉందని ఆయన శనివారం ఉదయం అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో చిదంబరం పాత్ర లేదని కేంద్ర మంత్రి నారాయణ స్వామి అన్నారు. వ్యక్తిగత కక్షతోనే సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారని ఆయన ఆరోపించారు. కాగా కోర్టు తీర్పు పట్ల సుబ్రహ్మణ్యస్వామి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక కోర్టు కొట్టివేసినా, హైకోర్టుకు వెళతానని, అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని ఆయన తెలిపారు.


