ఐఎఎస్ అధికారుల వైఖరిపై ద్వివేది వ్యాఖ్యలు
Published on: Sat Feb 4, 2012 9:51AM
న్యూ
ఢిల్లీ: ఐఏఎస్‌ల రక్షణ కోసం చాలినన్ని నిబంధనలు ఉన్నాయని నిబంధనల ప్రకారం పని చేస్తే.. ఎలాంటి సమస్యలూ ఎదురు కావని, ఈ ఉద్యోగంలో బిజినెస్ రూల్స్‌ను అనుసరించి పనిచేసే ఎవరూ ఏ భయాలూ పెట్టుకోవాల్సిన పనిలేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది ఐఎఎస్ అధికారుల వైఖరిపై వ్యాఖ్యానించారు. విచారణ సందర్భంగా ఎవరినైనా సీబీఐ హింసిస్తోందని నేను అనుకోవటం లేదని ఆయన అన్నారు. తప్పు చేయకుంటే భయమెందుకుని ఆయన ప్రశ్నించారు. కేవలం ఇద్దరు ఐఏఎస్ అధికారులు.. శ్రీలక్ష్మి, బి.పి.ఆచార్య మాత్రమే జైలుకు వెళ్లారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుత పరిణామాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ఠ దిగజారదని, రాష్ట్ర ప్రతిష్ఠ సమున్నతంగా ఉందని, రాష్ట్ర కేడర్ దేశంలోనే గొప్ప వాటిలో ఒకటని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ద్వివేదీ ఏపీ భవన్లో శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డిని ఐఏఎస్ అధికారులు కలిసి అవినీతి కేసుల్లో సీబీఐ దర్యాప్తు తీరు మీద ఆందోళన వ్యక్తం చేసిన అంశంపై పంకజ్ ద్వివేదీ స్పందించారు. ఐఏఎస్‌లు కొందరు తనను కూడా గురువారం కలిశారని ఆయన చెప్పారు.
సీబీఐ విచారణల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నామని కొందరు అధికారులు అంటున్నారని, సీబీఐ విచారణ సందర్భంగా హింసిస్తున్నారన్న కొందరు ఐఏఎస్‌లు అభిప్రాయాలు వారి వ్యక్తిగతమేనని, నిబంధనల ప్రకారం పని చేస్తే ఎలాంటి సమస్యలూ ఎదురు కావని ఆయన చెప్పారు. "ఎవ్వరూ మనోనిబ్బరం కోల్పోవద్దు. న్యాయ వ్యవస్థపై మనకు విశ్వాసం ఉండాలి. దానికంటే ముందు మనం చేస్తున్న సేవపై మనకు నమ్మకం ఉండాలి. వ్యక్తికంటే వ్యవస్థ ఎప్పుడూ గొప్పది'' అని ఐఏఎస్ అధికారులకు పిలుపునిచ్చారు.


