ఫోర్బ్స్ జాబితాలో భారత యువ కెరటాలు
Published on: Thu Dec 22, 2011 1:40PM
న్యూ
ఢిల్లీ : ఫోర్బ్స్ మేగజైన్ రూపొందించిన భవిష్యత్ ఆశాకిరణాల జాబితాలో 10 మంది భారత సంతతి యువతకు చోటు దక్కింది. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, పాప్ స్టార్ లేడీ గాగా వంటి ప్రముఖుల సరసన వీరికి స్థానం లభించింది. 30 ఏళ్ల లోపు ఉన్న 30 మంది ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితాను ఫోర్బ్స్ రూపొందించింది. వీరు కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నారని కొనియాడింది. ఇంధన, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోద, సైన్స్, డిజైన్స్, టెక్నాలజీ తదితర 12 రంగాలకు చెందిన ప్రముఖులను ఎంపిక చేసింది. ఒక్కో రంగంలో 30 మంది చొప్పున మొత్తం 360 మందితో జాబితా రూపొందించింది.
భారత్‌కు చెందిన విద్యార్థి పరమ్ జగ్గీ(17) కూడా ఉన్నారు. కార్ల పొగ గొట్టంలో అమర్చే ఓ పరికరాన్ని ఆయన తయారు చేశారు. ఇది కార్బన్‌డై ఆక్సైడ్ ఆక్సిజన్‌గా మార్చుతుంది.
డమాస్కస్ ఫార్చున్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వివేక్ నాయర్(23) కూడా ఫోర్బ్స్ ఎంపక చేసింది. పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాలను నానోట్యూబ్‌లుగా మార్చే సాంకేతికత పరిజ్ఞానం నాయర్ అభివృద్ధి చేస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ అమెరికా ఆర్థిక సలహాదారు వికాస్ మోహింద్రా(25), సిటీ గ్రూపుకు చెందిన మానవీర్ నిజ్జర్(28), పిన్న వయస్సులో గోల్డ్‌మాన్ సాచ్స్ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కునాల్‌షా(29), బయోలాజికల్ డైనమిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ రాజ్‌కృష్ణన్(29), యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ విద్యార్థి సిద్ధాంత్ గుప్తా(27)లు జాబితాలో స్థానం పొందారు. పుట్టగొడుగుల వ్యాపారం చేస్తున్న నికిల్ అరోరా(24), సీఎస్‌బీసీలో నిర్మాతగా పని చేస్తున్న మనీత్ ఆహుజా(27)ల ప్రతిభకు కూడా ఫోర్బ్స్ లో స్థానం లభించింది.


