TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోర్టులో AI లీలలు: లేని కేసులను సృష్టించి అడ్డంగా దొరికిపోయిన లాయర్!

Published on: Fri Jun 5, 2026 11:52AM

తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సుప్రీంకోర్టు అప్పీలేట్ డివిజన్‌లో జరిగిన ఒక సంఘటన లీగల్ సర్కిల్స్‌లో పెను సంచలనం సృష్టించింది. ఒక కేసు విచారణ సందర్భంగా లాయర్లు సమర్పించిన పత్రాలలో అసలు ఉనికిలోనే లేని ఫేక్ కోర్టు తీర్పులను, తప్పుడు ఉల్లేఖనాలను చేర్చడం కలకలం రేపింది. ఈ మోసాన్ని గమనించిన న్యాయమూర్తులు ఏకంగా కోర్టు లైవ్ స్ట్రీమింగ్ కెమెరాల ముందే లాయర్లను తీవ్రంగా మందలించారు.

ఈ వివాదానికి మూలం జుడిత్ ల్యాండ్‌బర్గ్ అనే మహిళ వేసిన సివిల్ దావా. న్యూయార్క్ నగర వీధిలో నడుస్తుండగా రోడ్డు పక్కన ఉన్న చెట్టు వేర్ల కారణంగా ఇటుకలు పైకి లేచి ఉన్నాయి. వాటిని గమనించకుండా నడిచిన ల్యాండ్‌బర్గ్ అక్కడ తడబడి కిందపడిపోయారు. ఈ ప్రమాదానికి న్యూయార్క్ నగర యంత్రాంగమే బాధ్యత వహించాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ అప్పీల్ విచారణ సందర్భంగా ఆమె తరపు లాయర్ మైఖేల్ శాండర్స్ ఫుట్‌పాత్ (Sidewalk) పరిధి మరియు చట్టపరమైన నిబంధనలను వివరిస్తూ కోర్టుకు ఒక సుదీర్ఘమైన నివేదికను సమర్పించారు. అక్కడే అసలు కథ మొదలైంది.

మే 20న జరిగిన ఈ లైవ్ విచారణలో జస్టిస్ వాలెరీ బ్రాత్‌వైట్ నెల్సన్ మరియు జస్టిస్ హెక్టర్ లాసాల్ ఈ కేసును పరిశీలించారు. వాదనలు ప్రారంభమైన 19 నిమిషాల తర్వాత న్యాయమూర్తి నెల్సన్ జోక్యం చేసుకుంటూ లాయర్లకు ఊహించని షాక్ ఇచ్చారు. ల్యాండ్‌బర్గ్ లాయర్ సమర్పించిన డాక్యుమెంట్లలో కనీసం 3 కోర్టు కేసులు పూర్తిగా కల్పితమైనవని, అవి చట్టపరమైన చరిత్రలోనే ఎక్కడా లేవని తేల్చి చెప్పారు. కేవలం ఆ మూడు కేసులే కాకుండా, వారు ఉదహరించిన మరో 10 చట్టపరమైన ఉదాహరణలు కూడా అసలు చట్టానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని, కోర్టును తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు.