ఇవీ కొత్త సంవత్సరం వేడుకలే


ప్రపంచంలో ఒకో ప్రాంతానికీ ఒకో సంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయం ప్రకారం వారు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తారు. తెలుగువారు ఉగాది నాడు, పంజాబీలు వైశాఖి రోజున... ఇలా ఒకో సంస్కృతికీ ఒకో కొత్త సంవత్సరం ఉంది. కానీ మన రోజువారి జీవితంలో ఇంగ్లిష్ క్యాలెండరుని పాటించడం మొదలుపెట్టాక, జనవరి ఒకటిని కూడా ఘనంగా స్వాగతిస్తున్నాం. మరి ఆ కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ ఎలా జరుగుతాయో చూడండి...

 

అమెరికా

ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో నూతన సంవత్సర వేడుకలు జరిగే తీరే వేరు. డిసెంబరు నుంచే అక్కడ పండుగ వాతావరణం మొదలైపోతుంది. పార్టీలు, విందులు, వినోదాలతో దేశం యావత్తూ సందడిగా ఉంటుంది. ఇక డిసెంబరు 31న టైమ్‌ స్క్వేర్‌లో జరిగే బాల్‌డ్రాప్ అనే కార్యక్రమం ఆ దేశంలోని సంబరాలకు పరాకాష్ట. ఇందులో భాగంగా టైమ్‌ స్క్వేర్‌లో ఉన్న టైమ్స్‌ భవంతి మీద ఓ 140 అడుగుల ఎత్తున ఓ భారీ బంతిని ఉంచుతారు. 500 కిలోలతో వేలాది దీపాలతో ధగధగలాడిపోయే ఈ గాజు బంతి సరిగ్గా 11:59 నిమిషాలు వెలుగులు చిమ్ముతూ దిగడం మొదలుపెడుతుంది. 12:00 గంటలకల్లా భవంతి మీదకు చేరుకుంటుంది. ఆ సమయంలో హోరెత్తిపోయే సంగీతం, కళ్లు చెదిరిపోయే కాంతులని ఆస్వాదించేందుకు వేలాదిమంది టైమ్‌ స్క్వేర్‌కు చేరుకుంటారు.

 

ఇంగ్లండ్‌

అమెరికాలో జనం టైమ్‌ స్క్వేర్‌కు చేరుకున్నట్లే ఇంగ్లండు వాసులు ధేమ్స్‌ నది మీద ఉన్న వంతెన మీదకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రపంచ ప్రఖ్యాత బిగ్‌బెన్ గడియారం ఎప్పుడు 12 గంటలు మోగిస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తారు. 
ఇంగ్లండ్ పక్కనే ఉన్న స్కాట్‌లాండ్‌లో ‘first footing’ అనే వింతసంప్రదాయాన్ని పాటిస్తారు. ఇందులో భాగంగా కొత్త సంవత్సరం ఘడియలలో తమ ఇంట్లోకి అడుగుపెట్టే మొదటి వ్యక్తి నల్లటి జుత్తున్న అందమైన యువకుడై ఉండాలి. అతను బ్రెడ్డు, విస్కీతో పాటుగా కాస్త బొగ్గు ముక్కని కూడా తీసుకురావాలి. ఈ ఇంట్లో జరిగే కొత్త సంవత్సర వేడుక ముగిసిన తరువాత, ఆ యువకుడు వెనక గుమ్మం నుంచి వెళ్లిపోవాలి.

 

మెక్సికో

మెక్సికోలో జనం కొత్త సంవత్సరానికి ముందు తమ ఇళ్లను వేర్వేరు రంగులతో తీర్చిదిద్దుతారు. తమ మనసులో ఎలాంటి కోరిక ఉంటే, దానికి అనుగుణమైన రంగుని ఇంటికి వేస్తారట. డిసెంబరు 31 రాత్రివేళ ఆ ఏడాది జరిగిన బాధాకరమైన సంఘటలన్నింటినీ ఒక కాగితం మీద రాసి, దానిని మంటల్లోకి విసిరివేస్తారు. తద్వారా తమ జీవితంలోని బాధలన్నీ ఇక మీదట తీరిపోతాయని ఆశిస్తారు. ఇక ఆ రోజు అర్ధరాత్రి 12 గంటలు కొట్టే సమయంలో 12 ద్రాక్షలను తినడం సంప్రదాయం. తమ మనసులో ఉన్న ఒకో కోరికనీ గుర్తుచేసుకుంటూ ఈ 12 ద్రాక్షలూ తింటే తమ కోరికలు తప్పక నెరవేరతాయని వారి నమ్మకం.

 

గ్రీస్

కొత్త సంవత్సర వేడుకల కోసం గ్రీస్‌ ప్రజలు Vassilopita పేరుతో ఒక ప్రత్యేక బ్రెడ్డుని తయారుచేసుకుంటారు. ఈ బ్రెడ్డుని తయారుచేసే సమయంలో ఒక నాణాన్ని అందులో ఉంచుతారు. వేడుకలలో భాగంగా ఆ బ్రెడ్డుని కోసినప్పుడు, నాణెం ఎవరికైతే వస్తుందో వారిని అదృష్టం వరించినట్లు భావిస్తారు.

 

ఇవీ జనవరి 1నాడు జరుపుకొనే కొత్త సంవత్సరానికి సంబంధించి కొన్ని వింత ఆచారాలు. అయితే భారీగా బాణాసంచా కాల్చడం, పాత వస్తువులని పోగేసి చలిమంటలు వేయడం, రకరకాల పిండివంటలు తయారుచేసుకుని సుష్టుగా లాగించడం వంటి ఆచారాలు అన్నిచోట్లా కనిపించేవే.

 

- నిర్జర.