TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్ నూతన వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు..!

Published on: Mon Jul 20, 2026 2:25PM

 

రాష్ట్రంలో మాతా–శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోన్న ప్రభుత్వం… గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు కొత్తగా 'తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్' వాహనాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ వాహనాలను సోమవారం  సీఎం చంద్రబాబు  ముఖ్యమంత్రి  క్యాంపు కార్యాలయంలో పరిశీలించారు. 

ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన, భద్రతా ప్రమాణాలు, తల్లి–శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగేలా, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు.

అందుబాటులోకి 500 వాహనాలు..! 

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు, వారి నవజాత శిశువులు, సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణులకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే గర్భిణులకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక SUV/MUV వాహనాలను వినియోగించనున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.75 లక్షల మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు.

రియల్ టైమ్ పర్యవేక్షణకు జీపీఎస్ వ్యవస్థ..! 

వాహనాల్లో తల్లీ–శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా సౌకర్యాలను కల్పించారు. వెనుక సీట్లలో సీటు బెల్టులు, బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్‌రెస్ట్, ఎయిర్ కండిషనింగ్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణకు అవకాశం కల్పించారు. 

వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం, వాహనాల నిర్వహణ, రాష్ట్రవ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించారు. వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వీటి సేవలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య-కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరపాండ్యన్, ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) అధికారులు పాల్గొన్నారు. 

New vehicles for Mother-Child Express, CM Chandrababu, GPS tracking system, NHM, AP Health Department, Minister naralokesh