యూపీ రాజీ డ్రామాలో మరో మలుపు..
Published on: Wed Jan 12, 2022 2:44PM
ఉత్తప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల క్రతువు ఇంకా పూర్తిగా ప్రారంభం కాలేదు. కేవలం ఎన్నికల షెడ్యూలు మాత్రమే విడుదలైంది. కానీ, ఇంతలోనే రాజకీయం చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీరు పట్ల గుర్రుగా ఉన్న, కార్మిక శాఖ మంత్రి, బలమైన ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఒకే రోజు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అంతే అయితే, అదో రకం, కానీ కథ అక్కడితో ముగియ లేదు. మంత్రి పదవికి రాజీనామా చేసిన మంత్రి మౌర్య, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీలో చేరడం ఖాయమని వార్త లొచ్చాయి. మరెవరో కాదు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విటర్ వేదికగా మౌర్య పార్టీలో చేరుతున్నారని ప్రకటించారు. ముహూర్తం కూడా నిర్ణయించారు.
అయితే, ఇంతలోనే ఏమైందో ఏమో కానీ, తమ రాజీనామాపై వస్తోన్న వార్తలపై స్పందించిన మౌర్య, తాను కేవలం మంత్రిమండలి నుంచి మాత్రమే వైదొలిగానని, బీజేపీ పార్టీ సభ్యత్వానికి ఇంకా రాజీనామా చేయలేదని చెప్పారు. అలాగే, సమాజ్‌వాదీ పార్టీలో చేరే విషయమై కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మరో రెండు రోజుల తర్వాత తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని మౌర్య యూపీ స్టోరీని కొత్త మలుపు తిప్పారు.
దీని బట్టి చూస్తే అయన అటు బీజేపీతో ఇటు ఎస్పీతోనూ బేరసారాలు జరుపుతున్నారని అనుమానిన్చావలసి వస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, బీజేపీలో కొనసాగే ఆలోచన లేదన్న సంకేతాలు ఇచ్చారు. తన రాజీనామా బీజేపీలో ప్రకంపనలు సృష్టించిందని, రానున్న రోజుల్లో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశాలున్నాయని, మరో సంచలనానికి తెర తీశారు. ఆ విధంగా బీజేపీలో కొనసాగే ఆలోచన లేదని చెప్పకనే చెప్పారు.
మౌర్య వ్యవహారం ఆలా ఉంటే ఆయనతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమైన ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరైన వినయ్ షాక్యా కిడ్నాప్‌కు గురైనట్లు వచ్చిన వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. స్వయంగా ఆయన కుమార్తె రియానే బ్రెయిన్ స్ట్రోక్ కు గురైన తండ్రిని తన బాబాయే అపహరించినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనే తన తండ్రిని బలవంతంగా సమాజ్‌వాదీ పార్టీలో చేరుస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను ఎమ్మెల్యే వినయ్ ఖండించారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. తన కుమార్తె చెప్పిందాంట్లో నిజం లేదని, తాను స్వామి ప్రసాద్ మౌర్య వెంటే ఉంటానని స్పష్టం చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మొత్తానికి యూపీ రాజకీయం, నాటకీయ పరిణామాల మధ్య మలుపులు తిరుగుతోంది.


