పంచెతో ప్రాణం తీసుకోవాలనుకున్నారు... కోడెల ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు

 

కోడెల సూసైడ్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలను వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అయితే, కోడెల కొన్నాళ్లుగా సూసైడల్ టెండెన్సీతో బాధపడుతున్నారని పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. 20రోజుల క్రితం హైదరాబాద్‌కి వచ్చిన కోడెల..... అప్పట్నుంచి ఇంటి నుంచి బయటికి రాకుండా... తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. ముందుగా తాను కట్టుకున్న పంచెతో ఉరివేసుకునేందుకు ప్రయత్నించిన కోడెల.... కుదరకపోవడంతో ఆ తర్వాత కేబుల్ వైర్‌‌తో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. అయితే, నర్సరావుపేటలో కూడా ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం సేకరించారు. అయితే, అప్పుడు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పినట్లు పోలీసులు గుర్తించారు. ఇక కోడెల కేసులో భార్య, కూతురు, డ్రైవర్‌, గన్‌మన్‌‌ను సాక్షులుగా చేర్చిన పోలీసులు... త్వరలోనే కొడురు శివరామ్‌‌ను ప్రశ్నించనున్నారు.

కోడెల ఆత్మహత్య చేసుకున్న రూమ్‌ నుంచి మెడిసిన్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, అవన్నీ హై-డోస్ మెడిసిన్స్ గా పోలీసులు గుర్తించారు. సూసైడల్ టెండెన్సీ నుంచి బయటపడేందుకే ఆ మందులు వాడుతున్నట్లు అంచనాకి వచ్చారు. నర్సరావుపేటలో ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు 30 నిద్రమాత్రలు మింగినట్లు పోలీసులు విచారణలో తేలింది. అయితే అప్పుడు దానిని గుండెపోటుగా చెప్పి, కుటుంబ సభ్యులు ట్రీట్ మెంట్ చేయించినట్లు తెలిసింది. అప్పట్నుంచే కోడెల తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకే, హైదరాబాద్ వచ్చిన నాటి నుంచి కోడెల ఇంటికే పరిమితమై... ఎవరినీ కలిసేవారు కాదని, ఇంట్లో కూడా ముభావంగా ఉంటూ వచ్చారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఆత్మహత్యకు ముందురోజు మొత్తం 12 కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, కోడెల మొబైల్ మిస్ కావడంతో దాని కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు ఆత్మహత్య చేసుకున్న రోజు చివరిగా ఎవరితో మాట్లాడారనేది అత్యంత కీలకంగా మారింది. దాంతో కోడెల మొబైల్ ఏమైంది? ఆ మొబైల్  లో కోడెల ఏదైనా ఆడియో, వీడియో రికార్డు చేశారా? అందుకే దాన్ని మాయం చేశారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, కోడెల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నట్లు బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు తెలిపారు. ఇప్పటివరకు 12మందిని విచారించామని, అలాగే కుటుంబ సభ్యుల స్టేట్ మెంట్లు రికార్డు చేశామని చెప్పారు. అలాగే కోడెల ఫోన్ కాల్ డేటాపై ఆరా తీస్తున్నామని చెప్పిన బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు... మొబైల్ దొరికితే మరికొంత పురోగతి సాధించే అవకాశముందన్నారు.