TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోడి కత్తి కేసులో కొత్త మలుపు

Published on: Fri Jun 16, 2023 8:00AM

ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ మర్డర్ కేసులో నిదితుడిగా  ఉన్న ఒక ఎంపీకి, ముందస్తు బెయిల్  లభిస్తుంది. కానీ,  కోడి కత్తి కేసులో నిందితుడు, శ్రీనివాసరావు ఐదేళ్లుగా  జైలులో మగ్గుతున్నా, ఎన్ని సార్లు కోర్టును వేడుకున్నా, అతనికి మాత్రం బెయిల్  దక్కదు. కేసు విచారణ ముందుకు సాగదు. ఇదెక్కడి న్యాయం అని న్యాయ దేవతను అడగవచ్చునో లేదో కానీ, అడగడమే న్యాయం అనిపిస్తుంది.

 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో.. విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్ జగన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేడంతో జగన్‌కు గాయం అయ్యింది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టింది.. నాలుగేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతోంది. అడ్వొకేట్‌ కమిషనర్‌ను నియమించి స్టేట్‌మెంట్‌ తీసుకోవాలని, కేసును మరింత లోతుగా విచారణ చేయాలని కోరుతూ సీఎం జగన్‌ ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లపై వాదనలు వినిపించారు. అయితే న్యాయమూర్తి బదిలీపై వెళ్లి.. నూతన న్యాయమూర్తి రావటంతో మరోసారి పూర్తి స్థాయి వాదనలు వినిపించాల్సిన అవసరం ఉంది.

ఈ నేపధ్యంలో తాజగా ఈ కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో విచారణ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తరఫు లాయర్ వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ, ఇందుకు ఆయన సమయం కావాలని కోరారు. దీంతో కోర్టు కేసును తదుపరి వాదనల నిమిత్తం జులై 4కు వాయిదా వేశారు. ఇదిలా ఉంటే కోడి కత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాశారు. తన ఇబ్బందుల్ని ప్రధానంగా ఆ లేఖలో ప్రస్తావించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో గత 1,610 రోజులుగా విచారణ ఖైదీగా మగ్గుతున్నానని లేఖలో పేర్కొన్నారు. కోడికత్తి కేసును త్వరితగతిన విచారణ చేయాలని.. ఒకవేళ లేని పక్షంలో తనకు బెయిల్‌ అయినా ఇవ్వాలని గతంలోనే కింది కోర్టుకు పలుసార్లు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని పేర్కొన్నాడు. న్యాయం చేయాలని తన తల్లి కూడా అర్జీ పెట్టారని.. అయినా పురోగతి లేదన్నాడు. కేసు నమోదై ఐదేళ్లు అవుతున్నా కింది కోర్టు పదేపదే తన రిమాండ్‌ కాలాన్ని పొడిగిస్తోందని చెప్పాడు.

తమది పేద కుటుంబం, వృద్ధులు కావడంతో పై కోర్టుల్లో అప్పీల్‌కు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. జైలులో ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నాని.. వీటిని పరిగణనలోకి తీసుకుని కేసు త్వరగా విచారణ జరిగేలా చూడాలని శ్రీనివాసరావు కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి గురువారం లేఖ రాశారు. మరి శ్రీనివాసరావు రాసిన ఈ లేఖపై సీజేఐ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. సుప్రీం సీజేఐకి లేఖ పంపిస్తామని నిందితుడి తరఫు లాయర్ తెలిపారు. ఈ కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ అధికారులు చెప్పినా కొత్తగా పిటిషన్‌ వేయడం వెనక వేరే కారణాలు ఉన్నాయన్నారు. విచారణను వేగవంతం చేసి కేసుకు ముగింపు పలకాలని, లేదంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. 

కాగా, న్యాయం జరగడమే కాదు, న్యాయం జరుగుతుందనే విశ్వాసం కల్పించడం కూడా న్యాయ వ్యవస్థ కర్తవ్యమని, న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అలాగే,  ‘,Justice delayed is justice denied’… ఆలస్యంగా జరిగే న్యాయం అన్యయంతో సమానం ..న్యాయాన్ని తిరస్క్రించడమే, అని న్యాయకోవిదులు గుర్తు చేస్తున్నారు.