ప్రజల జేబులు ఖాళీ చేసేందుకు త్వరలో సరికొత్త ఆర్.టీ.ఓ. విధానాలు

 

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారి నిన్న పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, “ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్.టీ.ఓ. వ్యవస్థను, విధానాలను సమూలంగా మార్చవలసిన తరుణం ఆసన్నమయింది. అందుకోసం మా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కొత్త చట్టాలను సిద్దం చేస్తోంది. అవి ఇప్పుడున్న విధానాల కంటే చాల మెరుగైనవి, సమర్ధనీయమైనవి. వాటిని త్వరలోనే అమలులోకి తీసుకు వస్తాము. ప్రస్తుత వ్యవస్థలో, విధానాలలో అంతటా అవినీతి, డబ్బు రాజ్యం ఏలుతోంది. దానికి ఆస్కారం లేకుండా అత్యాధునిక వ్యవస్థను, విధానాలను అమలులోకి తీసుకువస్తాము. లండన్ వంటి నగరాలలో అనుసరిస్తున్న అత్యాధుని ట్రాఫిక్ విధానాలను మనదేశంలో కూడా అమలు చేసేందుకు వీలుగా చట్టాలను రూపొందిస్తున్నాము. అవి అమలయితే ఇక ఆర్.టీ.ఓ. వ్యవస్థలో అవినీతికి తావు ఉండదు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారు చట్టం దృష్టి నుండి తప్పించుకోలేరు. ఎవరయినా ఎక్కడయినా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లయితే సదరు వాహనదారు ఇంటికే నేరుగా జరిమానా నోటీసు చేరిపోతుంది. దానిని కోర్టులో సవాలు చేసేందుకు సాహసితే మూడు రెట్లు జరిమానా వసూలు చేయబడుతుంది,” అని అన్నారు.

 

సాధారణంగా ప్రభుత్వం కొత్త సౌకర్యాలు లేదా తమకు లబ్ది చేకూరే పధకాలు ప్రేవేశ పెడుతుందని ప్రజలు ఆశిస్తుంటారు. కానీ ఈవిధంగా కొత్త విధానాల ద్వారా తమ జేబులకు చిల్లులు పెట్టాలని ఎవరూ కోరుకోరు. భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు జరగడం పెద్ద వింత కాదు. కొత్త విషయము కాదు. కానీ అందుకు ప్రధాన కారణం నానాటికి పెరిగిపోతున్న జనాభా మరియు ట్రాఫిక్ రద్దీ. నేటికీ మహానగరాలలో సైతం గోతులు పడిన రోడ్లు, రోడ్ల మీద పారే మురుగు నీరు, ఇరుకు సందులు, వాటిలో విచ్చల విడిగా తిరిగే పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు కనబడుతూనే ఉంటాయి.

 

కానీ ఇంతవరకు పరిపాలించిన ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారం కోసం కొత్తగా రోడ్లు నిర్మించడం, రోడ్లు వెడల్పు చేయడం, ఫ్లై ఓవర్లు కట్టించడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బస్సులు, మెట్రో రైళ్ళను ఏర్పాటు చేయడం, నదులు, కాలవలు పారే ప్రాంతాలలో కొత్తగా జల రవాణా వ్యవస్థలను ఏర్పాటుకు గట్టిగా కృషి చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహించాయి. కనీసం ప్రస్తుతం ఉన్న రోడ్లను, వ్యవస్థలలో లోపాలను ఎప్పటికప్పుడు సరిదిద్దే ప్రయత్నాలు చేయలేదు. అందువలననే నిత్యం రోడ్డు ప్రమాదాలలో వందలాది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. కానీ ప్రభుత్వాలు ఎన్నడూ మేల్కొనలేదు. రోడ్డు ప్రయాణికులకు సరయిన సౌకర్యాలు, తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయినా, నిబంధనల పేరిట ట్రాఫిక్ పోలీసులు, ఆర్.టీ.ఓ. అధికారులు వారిని నిత్యం దోచుకొంటూనే ఉన్నారు.

 

ఇప్పడు కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించేందుకు ఏమి చేయాలో ఆలోచించకుండా, ప్రజల ముక్కుపిండి డబ్బు వసూలు చేస్తున్న ఆ ఆ.ర్టీ.ఓ. వ్యవస్థను మరింత పటిష్టం చేస్తానని చెప్పడం హాస్యాస్పదం. మోడీ ప్రభుత్వంపై ప్రజలలో చాలా ఆశలున్నాయి. అందుకే ఆయన ప్రభుత్వం అధికారం చేప్పట్టిన నెల రోజుల్లోనే రైల్వే చార్జీలు భారీగా పెంచినప్పటికీ, ప్రజలు ఆయనపై నమ్మకంతో సర్దిచెప్పుకొని కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఇప్పుడు రవాణాశాఖా మంత్రిగారు ప్రజల ముక్కు పిండి డబ్బు వసూలు చేసేందుకు చట్టాలు సవరిస్తామని చెప్పడం చూస్తే ఇకపై ప్రజలు జేబు నిండా డబ్బుంటే తప్ప రోడ్లమీద తిరిగే సాహసం చేయకూడదని అర్ధమవుతోంది. ఆవిధంగానయినా దేశంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించి, రోడ్డు ప్రమాదాలు అరికడదామని మంత్రిగారు భావిస్తున్నారేమో!