TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీకే వ‌ర్సెస్ సునీల్‌.. చంద్ర‌బాబు, రేవంత్‌ల‌ కోసం కొత్త వ్యూహ‌క‌ర్త‌..

Published on: Fri Feb 25, 2022 12:26PM

కురు పాండవ యుద్దంలో కృష్ణుడు ఎవరి పక్షాన ఉంటే వారిదే విజయం. అందుకే యుద్ధం ముందు, పాండవుల పక్షాన అర్జనుడు, కౌరవుల పక్షాన దుర్యోధనుడు కృష్ణుని వద్దకు వెళ్ళి సహాయం కోరతారు. అనేక సినిమాల్లో చూసిన ఈ దృశ్యం మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో,దుర్యోధనుడు అర్జునుని కన్నా ముందు వెళ్లి నిద్రిస్తున్నకృష్ణుని తల వద్ద కూర్చుంటే, తర్వాత వచ్చిన అర్జునుడు కృష్ణుని పాదాల  వద్ద కూర్చుంటాడు. కృష్ణుడు నిద్ర లేవగానే ఎదురుగా ఉన్న అర్జునుడుని చూసి, వచ్చిన పని అడుగుతాడు. అయితే దుర్యోధనుడు ముందుగ వచ్చిన తనకు ముందుగా తన కోరిక వినాలని తనకు ముందుగా  అవకాశం ఇవ్వాలని అడ్డం తిరగడంతో చివరకు వయా మీడియాగ  కృష్ణుడు, “నేను కావాలా లేదా నా సైన్యం కావాలా” కోరుకోమని ఇద్దరికి ఆప్షన్ ఇచ్చాడు. అందుకు ముందుగా అర్జనుడు,‘’నిరాయుధుడైన కృష్ణుడు’ కావాలని కోరుకుంటే, దుర్యోధనుడు కృష్ణుడి సైన్యం తనకుదక్కినందుకు మురిసి  పోతాడు. కానీ, చివరకు ఏమి జరిగింది, తెలిసిందే. శ్రీ కృష్ణుని సైన్యంతో కలుపుకుని కౌరవ సైన్యం పాండవ సైన్యం కంటే ఇంచుమింగుగా రెట్టింపు ఉన్నా, పాండవులే జయించారు. అది ధర్మ విజయంగా నిలిచి పోయింది.  

ఇక ప్రస్తుతంలోకి వస్తే, దేశంలో రగులుతున్న రాజకీయ కురుక్షేత్రంలో రాజకీయ పార్టీలు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, (పీకే) వైపు పరుగులు తీస్తున్నాయి. పీకే కాదంటే ఆయన బృందంలోని ఇంకొకరితో వందల కోట్ల డీల్ కుదుర్చుకుంటున్నాయి. అందుకే ఇప్పడు  మహాభారత ఘట్టం గుర్తుకొస్తోంది. అయితే, ఒక్కడి కోసం ఇరు పక్షాలు పోటీ పడడం మినహాయిస్తే, ఆ నాటి ధర్మ యుద్దానికి,ఈ రోజు జరుగుతున్న అరాచక రాజకీయాలకు పోలిక కుదరదు. పొంతన చిక్కదు. నిజమే, శ్రీ కృష్ణుని వ్యూహ రచనతోనే పాండవ విజయం సాధ్యమైంది. అయితే, శ్రీ కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం వ్యూహరచన చేశారు. ప్రశాంత్ కిశోర్ ఎందుకోసం చేస్తున్నారో, చూస్తునే  ఉన్నాం. అరాచక సృష్టికోసమే, అధర్మ మార్గంలో కేవలం డబ్బు కోసం పీకే పాచికలు వేస్తున్నారు అనేది, అందరికీ అర్ధంవుతున్న వాస్తఃవం. పీకే తమ వ్యూహంలో ప్రజల ప్రయోజనాలు, రాష్ట్రం దేశం భవిష్యత్ ప్రయోజనాలను పట్టించుకోరు. కేవలం టం క్లైంట్ గెలుపు మాత్రమే అతని లక్ష్యం. ఇందుకు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాగిస్తున్నఅరాచక పాలనే ప్రత్యక్ష సాక్ష్యం, ఇంకొక ఉదాహరణ అవసరం లేదు. జగన్ రెడ్డి పీకే ఫార్ముల ఫాలో అవడం వల్లనే ఈరోజు, ఆంధ్ర ప్రదేశ్ అరాచకాలకు నిలయంగా మారింది. అప్పుల్లో కూరుకు పోయింది. అనాధగా మిగిలింది.  

అయినా ప్రశాంత్ కిశోర్, కాదంటే ఆయన నడుతున్న ఐ ప్యాక్’ లో పనిచేసిన, చేస్తున్న వారి వెంట రాజకీయ పార్టీలు పరుగు తీసునే ఉన్నాయి. నిజానికి, ఒకే ఒక్క ‘క్లైంట్’ ను నమ్ముకుని వ్యాపారం చేసే కంటే పది ‘క్లైంట్స్’తో బిజినెస్ చేయడం లాభసాటిగా ఉంటుందననే, ‘వ్యూహం’తో పీకే తమ బృందంలోని కొందరిని బయటకు పంపి ఒకే రాష్ట్రంలో ఇద్దరు ముగ్గురు క్లైంట్స్’తో బిజినెస్ డీల్ కుదుర్చుకుంటున్నారనే అనుమానాలు కూడా ఇప్పుడిప్పుడే అక్కడక్కడా  వినవస్తున్నాయి. తెలుగు రాష్రాల విషయాన్నే తీసుకుంటే, ఏపీలో వైసీపీతో పీకే డీల్ కొనసాగుతోంది. ఇప్పుడు కొత్తగా, ఆయన బృందంలోని మాజీ సభ్యుడు సునీల్’తో  టీడీపీ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది, తెలంగాణలో పీకే, తెరాసతో డీల్ కుదుర్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. కొత్తగా షర్మిల పెట్టిన పార్టీ వైఎస్సార్ టీపీ కూడా పీకే బృందంలోని ఒక మాజీ సభ్యునితో డీల్ కుదుర్చుకుంది. 

అదలా ఉంటే, రాష్టంలో కాంగ్రెస్ హైకమాండ్ పీకే వ్యూహాలను తిప్పి కొట్టేందుకు, తమిళనాడులో అన్నాడీఎంకే తరపున పనిచేసిన సునీల్ అనే పీకే బృందం మాజీ సభ్యుని ఎంగేజి చేసిందని సమాచారం. సునీల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను గెలిపించలేక పోయిన, పరువును అయితే కాపాడారు.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు దక్కించుకున్న అన్నాడీఎంకే అసెంబ్లీ ఎన్నికలలో కాసింత గౌరవప్రదంగా ఓడిపోయింది. దానికి కారణం సునీల్ కణుగోలు సలహాలేనని ప్రచారం జరిగింది. ఇప్పుడు సునీల్ తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ కోసం పని చేయాలని ఒప్పందం చేసుకున్నారు. సునీల్ ప్రశాంత్ కిశోర్ కలిసి ఐప్యాక్లో పని చేశారు. 

ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశం వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. వ్యుహకర్తలే పార్టీలను, నాయకులను గెలిపిస్తారనే నమ్మకం పెరిగిపోతోంది. నిజానికి, ప్రశాంత్ కిశోర్’ను తెరమీదకు తెచ్చింది, బీజేపీ, నరేద్ర మోడీ. 2014 ఎన్నికల్లో పీకే, మోడీతో డీల్ కుదుర్చుకున్నారు..ఆ ఎన్నికల్లో బీజేపీ విజయానికి, అంతకు ముందు  పదేళ్ళు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అప్పటికి  మోడీకి ఉన్న చరిష్మా ప్రధాన కారణాలు. అయినా,  క్రెడిట్ మాత్రం పీకే ఖాతాలో చేరింది. ఇక అక్కడి నుంచి ఆయన డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ, వ్యుహకర్తలను పెట్టుకోవడం, అందు కోసం వందల వేల కోట్లు ఖర్చు చేయడం అనివార్యంగా, ప్రాక్టీసుగా మారే ప్రమాదం కనిపిస్తోందనే ఆందోళన మొదలైంది. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల సంస్కరణల గురించి ఆలోచించే ప్రజా వేదికలు ఈ విషం పై కూడా దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైందని పిస్తోందని అంటున్నారు.