TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

JBP- ఏపీలో కొత్త పార్టీ.. 'జ‌డ‌'- జ‌గ‌నన్న‌కు ద‌డ ద‌డ‌!

Published on: Fri Apr 15, 2022 3:50PM

జైభీమ్‌ భారత్‌ పార్టీ. పేరు చూస్తూనే తెలిసిపోతుంది ఇది ద‌ళిత పార్టీ అని. ఇక ఈ పార్టీ పెట్టింది కూడా ఏ మామూలు వ్య‌క్తో కాదు. ఏపీ హైకోర్టులో జ‌గ‌న్‌ను, వైసీపీ స‌ర్కారును కేసుల‌తో ముప్పుతిప్ప‌లు పెడుతున్న జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్‌. ఈ పేరు వింటేనే జ‌గ‌న‌న్న‌కు ఝ‌ల‌క్‌. అలాంటి శ్ర‌వ‌ణ్ కుమార్ కొత్త రాజకీయ పార్టీ పెట్ట‌డం జ‌గ‌న్‌రెడ్డికి షాకింగ్ ప‌రిణామ‌మే. అందుకే, వైసీపీ అధినేతలో క‌ల‌వ‌రం పెరిగిపోయింద‌ని అంటున్నారు. పార్టీ ఆరంభ ప్ర‌సంగంలోనూ.. జ‌గ‌న్‌ను, వైసీపీనే టార్గెట్ చేయ‌డంతో.. ఇక ముందుముందు అధికార పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌క‌పోవ‌చ్చు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా.. వైసీపీకి ప్ర‌ధాన ఓటు బ్యాంకుగా ఉన్న ద‌ళితుల‌ను ఏకం చేయ‌డంలో జైభీమ్ భార‌త్ పార్టీ-జేబీపీ ముందుంటుంద‌నే టెన్ష‌న్ ముఖ్య‌మంత్రిని ఉలిక్కిప‌డేలా చేస్తోంద‌ని అంటున్నారు. 

రాష్ట్రంలో పొలిటికల్‌ వాక్యూమ్‌ ఉందని.. దళితుల కోసం పోరాడే పార్టీ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదని జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్ అన్నారు. దళిత బిడ్డలకు మేనమామ అని చెప్పిన జగన్‌.. ఆ తరువాత చేసిన అన్యాయం ఎవ్వరూ మర్చిపోరని.. వైసీపీ దుర్మార్గ పాలనను ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. వైసీపీలోని దళిత నాయకులను ఓడించేందుకే ఈ పార్టీ పెడుతున్నట్టు శ్ర‌వ‌ణ్ కుమార్‌ స్పష్టం చేశారు. 26 రకాల దళిత స్కీమ్‌లను జగన్‌ రద్దు చేశారని మండిప‌డ్డారు. ఓడిపో.. ఓడించు.. గెలువు.. అనే కాన్షీరామ్‌ మాటలు తనకు స్ఫూర్తి అని శ్రవణ్‌ కుమార్ చెప్పారు. శ్ర‌వ‌ణ్ మాట‌లు జ‌గ‌న్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్‌. 28ఏళ్లకే న్యాయమూర్తి అయ్యారు. పదేళ్లు జ‌డ్జిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత న్యాయ‌వాదిగా మారి.. ప్ర‌భుత్వాల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. ప్ర‌స్తుతం కోర్టు కేసులతో జ‌గ‌న్ స‌ర్కారును ముప్పుతిప్పలు పెడుతున్న లాయర్లలో ఆయన  ముఖ్య‌మైన వారు. అమ‌రావ‌తి కోసం రాజధాని రైతుల కేసులు, విశాఖలో డాక్ట‌ర్‌ సుధాకర్‌ కేసుల్లో బాధితుల త‌ర‌ఫున వాదించారు. రాష్ట్రంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా.. అన్యాయం జ‌రిగినా.. హైకోర్టులో కేసుల‌తో వారికి అండగా నిలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడుకూడా ఆయన కోర్టులో పిటిషన్లు వేశారు. అలాంటి జ‌డ శ్ర‌వ‌ణ్ కుమార్‌.. ప్రజలు తమ హక్కులను స్వేచ్ఛగా పొందేందుకు, అవినీతి లేని పాలన కోసమే కొత్త పార్టీ పెడుతున్నట్టు.. జీబీపీని ప్ర‌క‌టించి ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌ణ‌లు రేపారు.