ఆసక్తి పెంచుతున్న లక్కు కిక్కు
Published on: Fri Jun 29, 2012 2:24PM
మద్యం నూతనపాలసీకి ‘లక్కు`కిక్కు’ పేరిట మంచి ప్రచారమే లభించింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ లక్కు`కిక్కు గురించే చర్చలూ నడిచాయి. లక్కీడీప్ ద్వారా మద్యం దుకాణాలను కేటాయించటం రాష్ట్రప్రజలకు ఆసక్తిని కలిగించింది. మద్యం దుకాణాలు మహిళల పేరిట ప్రకటించటం కూడా ఇదే తొలిసారి. వీరు కుటుంబసమేతంగా ఈ లక్కీడ్రాకు హాజరవటం కూడా పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రోజంతా కష్టపడి అలిసిన వారికి మద్యం ఉపశమనం కలిగించేది. ఇది గతం. ఇప్పుడు మారిన కాలంతో పాటు మారే పరిస్థితులను గమనిస్తే మద్యం తాగటం ఒక ఫ్యాషన్ అయింది. విదేశీసంస్కృతిని అనుసరించే యువత రాత్రయ్యేటప్పటికి మద్యం సేవిస్తున్నారు. ఆ మత్తులో ప్రమాదాల బారిన పడుతున్నారు. అయినా మద్యం మాత్రం ఒక నాగరికతగా భావిస్తున్నారు. అన్ని వయస్సుల వారు తాగేస్తున్నారు. ప్రత్యేకించి 5శాతం భారతీయ మహిళలు కూడా ఈ మద్యానికి బానిసవుతున్నారని ఇటీవల నిర్వహించిన సర్వేల్లో తేలింది. దీంతో అన్ని వ్యాపారాల్లోకి మద్యం ఒక్కటే లాభసాటి. ఇందులో కేసులు ఎదుర్కొన్న పాత సిండికేటులోని వ్యాపారుల లాభమే నూరుశాతం దాటి సంపాదించటం చిన్నవ్యాపారులను ఆకర్షించింది. చిన్నకాంట్రాక్టులు చేసేవారు, వ్యాపారులు తమ లక్కు పరిశీలించుకోవటానికి ధరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం పలుప్రాంతాల్లో చర్చనీయాంశమవుతోంది. ఈ వ్యాపారంతో తమ జాతకం మార్చుకోవాలనుకున్న వారి బలహీనతను జ్యోతిష్కులూ సొమ్ము చేసుకున్నారు. ఆ లక్కు నీకే ఉందోయ్! భేషుగ్గా ధరఖాస్తు చేసుకో అంటూ జ్యోతిష్కులు కొందరిని ప్రోత్సహించారు. అలానే నీ పేరు కాకుండా మీ సతీమణి పేరు పెట్టేయ్ లక్కు నీదేనోయ్ అని సెలవిచ్చిన జ్యోతీష్కులూ ఉన్నారు. వీరి ప్రోద్బలం క్యూను పెంచిందని ఎక్సయిజ్ సిబ్బంది తెలిపారు.
గతంలో కన్నా ఈ ఏడాది మద్యం దుకాణాల కేటాయింపు చాలా కష్టతరమైందని ఎక్సయిజ్ సిబ్బంది స్పష్టం చేశారు. అయితే లక్కు కొద్దీ తమకు దుకాణం వస్తే వెంటనే సొమ్ము చేసుకోవటానికి పాతమద్యం వ్యాపారికి అమ్ముడుపోయేందుకూ కొందరు సిద్ధమయ్యారు. కొందరైతే పాత వ్యాపారి పేరును పార్టనర్గా చూపుతూ ధరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఖమ్మం ఏజెన్సీలో మాత్రం పీసా చట్టం ప్రకారం దుకాణాలు కేటాయించాలని ఇన్ఛార్జి కలెక్టర్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అక్కడ 71దుకాణాలకు లాటరీ నిలిచిపోయింది. మళ్లీ జాబితా పరిశీలించి అర్హులను నిర్ణయిస్తామని ఎక్సయిజ్ సిబ్బంది ధరఖాస్తుదారులను తిప్పి పంపించారు. రాష్ట్రరాజధాని హైదరాబాద్లో 212దుకాణాలకు గాను 354 ధరఖాస్తులు అందాయి. వీటిలో 154దుకాణాలకు మాత్రమే లాటరీ తీయవచ్చు. మిగిలిన 81 దుకాణాలకు ఒక్క ధరఖాస్తు వచ్చింది. మొత్తంగా పరిశీలిస్తే ఈ ధరఖాస్తులను బట్టి 71దుకాణాలకే పోటీ ఉంది. ధరఖాస్తులు అందని దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎక్సయిజ్ కమిషనర్ ప్రకటించారు. రాష్ట్రంలోని పాతమద్యం సిండికేట్లు కొత్తయోచన చేశాయి. మొత్తం దుకాణాల కేటాయింపు పూర్తయ్యాక ప్రాంతాల వారీగా పార్టనర్గా చేరి వ్యాపారం సొంతం చేసుకోవాలని వారు ఉబలాటపడుతున్నారు.


