సంక్రాంతి సెలవులు మార్చేసిన ఏపీ.. పండగ తేదీపై వివాదం..
Published on: Tue Jan 11, 2022 3:56PM
సంక్రాంతి ఎప్పుడు? 15 నా? 14 నా? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 15 సంక్రాంతి అంటుంటే.. కాదు కాదు 14నే జరుపుకోవాలని కొందరు పండితులు వాదిస్తున్నారు. ఇలా తొలిసారి సంక్రాంతి పండగ తేదీలపై కన్ఫ్యూజన్ ఏర్పడింది.
దేశంలో 27 రాష్ట్ర ప్రభుత్వాలు జనవరి 14 వ తేదీన మకర సంక్రాంతిగా ప్రకటించాయి కానీ.. రెండు తెలుగు రాష్ట్రాలు 15వ తేదీని ప్రకటించడం బాధాకరమని భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ కర్త శ్రీనివాస్ గార్గేయ అంటున్నారు. జనవరి 14 మధ్యాహ్నం 2.29 నిమిషాలకు మకర సంక్రమణమని కచ్చితంగా చెబుతున్నారు.
పితృ దేవతలకు పిండ ప్రదానాలు చేయవలసినది 14 తేదీ మాత్రమేనని, ప్రభుత్వాలు తమ నిర్ణయం మార్చుకుని 14వ తేదీని మకర సంక్రాంతిగా ప్రకటించాలని సూచించారు. పూర్వ గణిత పంచాంగ కర్తలకు దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి పదవులను ఇచ్చి.. పంచాంగాలను మార్చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మరోవైపు, ఏపీ ప్రభుత్వం మాత్రం సంక్రాంతి పండగ సెలవులను మారుస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతకుముందు 14, 15, 16 తేదీలను సెలవులుగా ప్రకటించగా.. ఆ డేట్స్ సవరిస్తూ.. 13, 14, 15 తేదీలను సంక్రాంతి సెలవులుగా వెల్లడిస్తూ జీవో విడుదల చేసింది. 16న ఆదివారం కావడంతో.. ఏపీలో వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.



