మాజీ ఎమ్మెల్యే మిస్సింగ్ అంటూ కొవ్వూరులో కార్యకర్తల ఆవేదన.. మాజీ మంత్రి రీఎంట్రీ!!

 

ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం.. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది ఎదురుకోవాలిసిందే. ఓడిన నేతలు పరాభవం నుంచి బయటపడి పార్టీ పటిష్టత కోసం పనిచేయాల్సి ఉంటుంది. తమ పార్టీ పరాజయం పాలైందన బాధతో ఉండే పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఓడిన వారిపైనే ఎక్కువగా ఉంటుంది. అంతేకానీ ఎలాగో ఓడిపోయాం.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవు కదా మళ్లీ ఎన్నికలు వచ్చినపుడు రంగంలోకి దిగుదాం అనుకుంటే రాజకీయంగా తమకు తాము నష్టం చేసుకోవడమే కాకుండా.. పార్టీ క్యాడర్ ను కూడా చేజారిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. ఈ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ టిడిపి కార్యకర్తలు ఎన్నికల్లో తమ పార్టీ వైపు నిలుచున్న అభ్యర్థి ఎవరు అనేది కూడా సంబంధం లేకుండా పార్టీ గెలుపుని భుజాన వేసుకుంటారాని టాక్ ఉంది. తెలుగు దేశం పార్టీ ఏర్పడిన తరువాత 2009 వరకు కొవ్వూరు శాసన సభ స్థానంలో 9 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 2 సార్లు మాత్రమే టిడిపి ఓటమి చెందింది. వైఎస్ రాజశేఖరెడ్డి ప్రభంజనం ఉన్న 2004,2009 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఓటర్లు టిడిపికే పట్టం గట్టారు. దీన్ని బట్టి చూస్తే ఈ నియోజకవర్గంపై తెలుగుదేశం పార్టీకి ఎంత పట్టుందో అర్థం చేసుకోవచ్చు. కంచుకోట లాంటి కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ నాయకత్వ లేమి నెలకొంది.

2019 ఏప్రిల్ లో జరిగిన ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి గా పోటీ చేసిన వంగలపూడి అనిత ఓటమి చెందారు. ఆ తర్వాత ఆమె కొవ్వూరు నియోజకవర్గంపై పూర్తిస్థాయి లో సీతకన్ను వేశారని స్థానిక పార్టీ కేడర్ లో గట్టి గానే వినిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జవహర్ కొవ్వూరు టిడిపిలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సొమ్ము చేసుకోడానికి పావులు కదుపుతూ ఉండటం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తుంది. దీంతో తాము ఎవరి నాయకత్వంలో పని చేయాలో తెలియని స్థితిలో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు.. కార్యకర్తలు.. సతమతమవున్నారు. అసలు ఇలాంటి పరిణామాలకు దారి తీసిన పరిస్థితులను ఆరా తీస్తే అనేక ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కొవ్వూరు టిడిపిలో రకరకాల సంక్షోభాలు తలెత్తాయి. అప్పటి మంత్రి జవహర్ కు అనుకూలంగా ఒక వర్గం వ్యతిరేకంగా ఒక వర్గం తయారై ఎవరికి వారు పోటా పోటీగా రాజకీయాలు చేయడం మొదలుపెట్టారు. ఒక వర్గం జవహర్ కు టికెట్ ఇవ్వాలని రోడ్డెక్కితే మరో వర్గం ఇవ్వడానికి వీల్లేదని వీధి కెక్కింది. ఇలా నాడు ఇరువర్గాల మధ్య నిత్యం రచ్చ జరుగుతుండడం పార్టీ హైకమాండ్ కి తలనొప్పిగా మారింది. విశాఖ జిల్లా పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితకు కూడా అక్కడ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకే ఎన్నికల సమయంలో ఆమెకు కొవ్వూరు టికెట్ ఇచ్చి.. జవహర్ కు తిరువూరు టిక్కెట్ ఇచ్చింది పార్టీ హైకమాండ్. అయినా కూడా రెండు చోట్ల వీరిద్దరూ ఓటమిని చవి చూసారు. ఇక రాష్ట్రాంలోనూ టిడిపి పరాజయం చెంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కొవ్వూరులో రాజకీయ పరిణమాలు చకచక మరాయి. 

ఎన్నికల్లో తెలుగుదేశం ఘోరంగా ఓడినప్పటికీ పార్టీ హైకమాండ్ కుంగిపోకుండా నియోజకవర్గాల్లో కార్యకర్తల మనోధైర్యం దెబ్బ తినకుండా ఎప్పటికప్పుడు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. అంతే కాకుండా పార్టీ అభ్యర్ధులుగా పోటీ చేసిన వారిని అదే నియోజకవర్గ ఇన్ ఛార్జిలుగా నియమించింది. ఇంఛార్జి గా వంగలపూడి అనిత కొవ్వూరు బాధ్యతలను చూడాల్సి ఉండగా నియోజకవర్గంలో అసలు ఆమె ప్రస్తానమే అయోమయంగా మారిందని స్థానిక నాయకులు, కార్యకర్తలు అనుకుంటున్నారు. నిజానికి ఎన్నికల ముగిసిన తర్వాత కేవలం ఒకటి రెండు సార్లు మాత్రమే వంగలపూడి అనిత కొవ్వూరు నియోజకవర్గం ముఖం చూశారని కొందరంటున్నారు. నియోజవర్గాన్ని ఆమె పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లేనన్న గుసగుసలు  కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. గతంలో జవహర్ తో విభేదించి అనితతో కలిసి పని చేసిన ఒక వర్గం నాయకులు పూర్తి గా డీలా పడిపోయారట. తమ నాయకురాలు తరచుగా వస్తే తమకు మనోధైర్యం ఉంటుందని వారు అనుకుంటున్నా.. ఆమె నియోజకవర్గం వైపు చూసే అవకాశాలే తక్కువ  ఉన్నాయనేది మరో వర్గం టాక్.

కొవ్వూరులో నెలకొన్న ఈ పరిణామాలే మళ్లీ జవహర్ వర్గానికి జీవం పోశాయి. ఆయన తిరిగి కొవ్వూరు తీసుకురావటానికి అడుగేసేలా చేశాయి. అందుకు జవహర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలకు ముందు కొవ్వూరు నియోజకవర్గంలో తన మీద వ్యతిరేకత ఉన్నప్పటికీ అక్కడి నుంచి పోటీ చెయ్యడానికి జవహర్ గట్టి ప్రయత్నమే చేశారు. కానీ అప్పటి పరిస్థితుల్లో అధిష్టానం ఆయనకు తిరువూరు టికెట్ కేటాయించింది. కానీ ఇప్పుడు అనిత పాయకరావుపేట పై మళ్లీ పట్టు సాధించడానికి ప్రయత్నిస్తూ కొవ్వూరును పట్టించుకోవడం లేదని టిడిపి వర్గాలు అనుకుంటుంన్నాయి. ఈ పరిణామాలన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జవహర్ ప్రయత్నిస్తున్నారని మరో ప్రచారం నడుస్తుంది. తిరువూరు నుంచి కొవ్వూరు తిరిగొచ్చి మళ్లీ చక్రం తిప్పాలని జవహర్ గట్టి గా ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా ఎవరి ప్రయత్నాలు ఎలా వున్నప్పటికీ కొవ్వూరు టిడిపికి మాత్రం నాయకత్వ లేమి ఏర్పడిందనేది సుస్పష్టంగా కమిపిస్తున్నాయి. మరి తెలుగు దేశం అధిష్టానం ఈ పరిస్థితులను ఎలా చక్కదిద్దుతుందో వేచి చూడాలి.