చైనా నుండి ప్రపంచానికి మరో గిఫ్ట్.. మరో కొత్త వైరస్ 

ప్రపంచం మొత్తం చైనా నుండి దిగుమతి ఐన కరోనా వైరస్ తో ఇప్పటికే అతలాకుతలం అవుతోంది. ఇప్పుడు దీనికి తోడు చైనా సైంటిస్టులు మరో కొత్త వైరస్ ను కనుగొన్నారు. అమెరికాకు చెందిన ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ జర్నల్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్ పేరు G4 EA H1N1. ఇది కూడా H1N1 వైరస్ జాతి నుండి వచ్చింది. ఈ H1N1 వైరస్ 2009లో ప్రపంచాన్ని ఒకసారి అల్లకల్లోలం చేసిన సంగతి తెలిసిందే. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఐతే మనకు మరో బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ కొత్త వైరస్‌ మనుషులకు కూడా సోకుతుంది.

ఈ వైరస్ తాజాగా వచ్చిందేమీ కాదట. 2011 నుండి 2018 మధ్య కాలంలో చైనాలోని పది ప్రావిన్సుల్లో ఉన్న పలు పశువుల ఆస్పత్రులు, జంతువధశాలలో ఉండే పందుల నుంచి 30వేల శాంపిల్స్ తీసుకుని సైంటిస్టులు రీసెర్చ్ చేసారు. వాటిలో 179 రకాల స్వైన్‌ ఫ్లూ వైరస్‌లను వారు కనుగొన్నారు. ఐతే ఆ వైరస్‌లు మనుషులకు సోకుతాయా అనే డౌట్ రావడంతో ముంగిస జాతికి చెందిన ఫెర్రెట్‌ అనే జంతువుపై ఆ వైరస్ లను ప్రయోగించారు. ఆ జంతువుకే ఎందుకంటే, మనుషులకు వైరస్‌లు సోకితే ఎంటువంటి లక్షణాలు వస్తాయో అటువంటి లక్షణాలు ఆ జంతువులలో కూడా కనిపిస్తాయి. తాజాగా ఫెర్రెట్ పై జరిపిన రీసెర్చ్ లో ఈ G4 EA H1N1 వైరస్‌ ఎక్కువ ప్రమాదకరమైనదిగా తేలింది. మరి ముఖ్యంగా ఇది మనుషుల్లో కరోనా లాగే త్వరగా వ్యాపించే ప్రమాదం ఉందని ఆ శాస్త్రవేత్తలు తేల్చారు.

మరో ముఖ్య విషయమేంటంటే ఈ కొత్త వైరస్ ఇప్పటికే మనుషులకు సోకింది. అక్కడ పందుల పరిశ్రమల్లో పని చేసే 10 మందిలో ఆ వైరస్ ఉంది. ఐతే మనుషుల్లోకి ఈ వైరస్ వచ్చిన తరువాత ఇది వేగంగా పెరగగలదు అలాగే తన రూపాన్ని కూడా మార్చుకోగలదు. మనం చూస్తున్న కరోనా ఇప్పటికే దాదాపు 60 రకాలుగా రూపాంతరం చెందింది. తాజాగా ఈ జీ4 వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందా అనేది తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఈ జీ-4 వైరస్ నుండి మనల్ని మనం కాపాడుకునేందుకు మన శరీరంలోని వ్యాధినిరోధక శక్తి సరిపోదని తేల్చి చెప్తున్నారు. ఐతే మరో వాదన ఏంటంటే ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న ఫ్లూ వ్యాక్సిన్ ఈ వైరస్ పై పని చేయదని ఐతే ఆ వ్యాక్సిన్ లో కొన్ని మార్పులతో దీనిని కంట్రోల్ చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తల వాదన.

అయినా ఇదెక్కడి గోలండీ బాబు.. చైనా వారి ఆహారపు అలవాట్లతో ప్రపంచం మొత్తం బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది.