కాంగ్రెస్‌లో నవశకం.. సీనియర్లు దారికొచ్చే.. రేవంత్‌ను అందరూ మెచ్చే..
Published on: Wed Jul 7, 2021 3:39PM
ఉత్తమ్.. కదిలొచ్చి బాధ్యతలు అప్పగించారు. భట్టి.. బెట్టు వీడి చేతులు కలిపారు. జగ్గారెడ్డి.. రేవంతే తమ బాస్ అంటూ జై కొట్టారు. శ్రీధర్‌బాబు.. రేవంత్ అయితే సరేనన్నారు. వీహెచ్ సైతం ఇప్పటికే ఆశీర్వదించారు. పొన్నాల, షబ్బీర్అలీ, మధుయాష్కీగౌడ్.. అంతా రేవంత్‌ను అభినందించారు. ఇక, కొరకరాని కొయ్యగా మారిన కోమటిరెడ్డి.. హైకమాండ్ ఆదేశాలతో హష్ గప్‌చుప్ అయ్యారు. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో సూపర్ బాస్.
నిన్నామొన్నటి దాకా తనను ఎదురించిన.. తనకు పీసీసీ ప్రెసిడెంట్ పదవి దక్కకుండా కుటిలయత్నాలు చేసిన.. సీనియర్లంతా ఇప్పుడు తోక ముడిచి దారికొచ్చారు. కాంగ్రెస్ కురవృద్ధుల నుంచి.. యంగ్ కార్యకర్తల వరకూ.. అంతా రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు.. కాంగ్రెస్‌కు పునర్‌వైభవం సాధించేందుకు ఒక్కతాటి మీదకు వచ్చారు. ఇప్పుడు.. ఒక్కటంటే ఒక్క అసమ్మతి స్వరం కూడా వినిపించడం లేదు. రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించే సమయానికి అసమ్మతి అంతా స్వీప్. దటీజ్ రేవంత్‌రెడ్డి. పక్కా లీడర్.
కాంగ్రెస్‌లో ఇది సరికొత్త కల్చర్. కాంగ్రెస్‌కు ఇప్పుడిక నవ శకం. ఎవరు నాయకత్వం వహించినా.. ఎవరికి వారే రాజకీయాలు చేసుకోవడం.. అధ్యక్షుడిని డోంట్‌కేర్ అన్నట్టు పట్టించుకోకపోవడం.. కాంగ్రెస్ సంస్కృతి. పీసీసీ చీఫ్‌గా ఎవరున్నా.. లుకలుకలు.. గుసగుసలు కామన్. ఇన్నేళ్లూ అదే జరిగింది. కానీ, రేవంత్‌రెడ్డి రాకతో కాంగ్రెస్ మారిపోయింది. పాత వాసనలు వదులుకుంటోంది. రోత రాజకీయాలను పక్కన పడేస్తోంది. ఇప్పుడంతా రేవంత్‌రెడ్డి లీడర్‌షిప్‌కు జేజేలు పలుకుతున్నారు. మనసులో ఏమున్నా.. అది నోరు దాటి బయటకు అనే సాహసం ఏ ఒక్కరికీ లేదనే చెప్పాలి. అలా కాదూ కూడదు అంటే.. ఇంతకుముందులా కాదు. రేవంత్‌ను ఎదిరిస్తే.. పార్టీలో భవిష్యత్ ఉండదు. అంతటి స్ట్రాంగ్ లీడర్ మరి. వైఎస్సార్ తర్వాత ఆ రేంజ్ ఛరిస్మా, కరిజ్మా ఉన్న నాయకుడు. ఇప్పుడు రేవంత్ ఉక్కుపిడికిలిలో కాంగ్రెస్ సురక్షితంగా ఉంది. కాదని ఎవరైనా పిడికిలి లేపితే.. రాళ్లతో కొట్టిచంపుడేననేది రేవంత్ కొత్తగా తీసుకొచ్చిన కాంగ్రెస్ ఫిలాసఫీ.
రేవంత్‌రెడ్డి మామూలు లీడర్ కాదు. దాదాపు ఇంటికో అభిమాని ఉన్నారంటారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ ఆయనకు ఫుల్ ఫ్యాన్స్. విదేశాల్లోనూ మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్. చోటామోటా నాయకుల నుంచి సో కాల్డ్ సీనియర్ల వరకూ.. ఇప్పుడు అంతా రేవంత్ జపమే. రేవంత్‌ను కాదనే నాయకుడికి ఇకపై కాంగ్రెస్‌లో పుట్టగతులు ఉండవనే రేంజ్‌కు రేవంత్ ఎదిగారు. పీసీసీ చీఫ్‌గా ఇప్పుడిక మరింత బలోపేతమయ్యారు. ఆ విషయం గుర్తెరిగే.. మనసులో ఏమున్నా.. ముఖంపై నవ్వు పులుముకున్నారు సీనియర్లంతా. తాను ఇంటికి వస్తాననగానే.. శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డిలాంటి నేతలు రేవంత్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. భట్టి విక్రమార్క.. మొదట తాను విక్రమార్కుడి రేంజ్‌లో మొండికేశారు. తనకే పీసీసీ పీఠం దక్కకపోవడంతో దోబూచులాడారు. గట్టిగా నోరెత్తి కేసీఆర్‌పై నాలుగు గట్టి విమర్శలు చేయలేని భట్టి చేతితో కాంగ్రెస్ పార్టీని పెట్టడానికి అధిష్టానం ఏమీ అమాయకురాలు కాదు. ఢిల్లీకి ఎవరి సత్తా ఏంటో తెలుసు. అయితే, భట్టి సీనియార్టీని గౌరవించి.. ఆయనకు నచ్చజెప్పి.. రాయబారం పంపి.. రేవంత్‌తో చేతులు కలిపేందుకు ఒప్పించింది కాంగ్రెస్ పార్టీ. సో.. ఇప్పటికైతే భట్టి.. దారికొచ్చినట్టే.
ఇక మిగిలింది కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఒక్కరే. తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రేపేమాపో ఆయన కాషాయ కండువా కప్పుకోవచ్చు అంటున్నారు. తన సోదరుడినే కాంగ్రెస్ వీడకుండా చేయలేని వెంకట్‌రెడ్డికి పార్టీ పగ్గాలు ఎందుకనేది ఓ ప్రశ్న. కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకే పరిమితమైన కోమటిరెడ్డిని.. రాష్ట్ర అధ్యక్షునిగా చేసేంత సాహసం చేస్తారా? రేవంత్‌రెడ్డి ఇమేజ్‌తో ఆయన సరితూగగలరా? మరెందుకు అంత అలక? ఇంకెందుకు అంత కడుపుమంట? అని అడుగుతున్నారు రేవంత్ అభిమానులు. రేవంత్‌రెడ్డి ఎంతలా కలుపుకు పోదామనుకుంటున్నా.. కలిసేందుకు ఇంకా ముందుకురాని ఒకేఒక్కడు కోమటిరెడ్డి. ఆయనకు సినిమా ముందుముందు ఉంటుందంటున్నారు. సో.. ఏదిఏమైనా.. రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించడంతో కాంగ్రెస్‌లో కొత్త శకం మొదలైందని చెప్పొచ్చు. డైనమిక్ లీడర్ రేవంత్‌రెడ్డి తన నాయకత్వ పటిమతో హస్తం పార్టీకి పునర్ వైభవం తీసుకొస్తారా? కాంగ్రెస్‌లో మరో వైఎస్సార్‌లా ఎదుగుతారా? కేసీఆర్‌ను ప్రగతిభవన్ నుంచి బయటకు గుంజుతారా? లెట్స్ సీ....


