ఢిల్లీ బహుత్ దూర్ హై, లేకిన్ కరోనా తో నజ్దీక్ మే.....

* సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైపు వెళ్లాలంటే ఒణుకుతున్న జనం
* ఎయిమ్స్, సర్ గంగారాం ఆస్పత్రుల వద్ద కూడా అదే పరిస్థితి

కరోనా పాజిటివ్ కేసుల్లో డాక్టర్లు, నర్సులు ఉండటం ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ ని కలవరపెడుతోంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఢిల్లీ సర్కారు సిద్ధమైనప్పటికీ, కరోనా తీవ్రత మాత్రం ఢిల్లీని హడలెత్తిస్తోంది. న్యూఢిల్లీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన తరువాత ఇప్పటివరకూ 24 మంది డాక్టర్లు, నర్సులు, శానిటేషన్ స్టాఫ్ తదితర హెల్త్ కేర్ వర్కర్లకు కరోనా వైరస్ సోకడంతో తీవ్ర కలకలం రేగుతోంది. వీరిలో ఇద్దరు విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన వారు ఉండగా, వీరిద్దరూ రెండు మొహల్లా క్లినిక్స్ లో పని చేశారు. సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో పని చేస్తున్న మరో డాక్టర్ కు తాను చికిత్స చేసిన రోగి నుంచి కరోనా సోకింది. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లో పని చేస్తున్న ఆరుగురు నర్సులు, ఇద్దరు డాక్టర్లకు, ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్ కు కరోనా పాజిటివ్ రాగా, వీరికి వ్యాధి ఎలా సోకిందన్న విషయమై స్పష్టమైన సమాచారం లేదు.
రెండు కొవిడ్-19 కేసులను ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండా అటెండ్ చేసినందుకు సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని 108 మందిని క్వారంటైన్ చేశారు. మహారాజా అగ్రసేన్ ఆసుపత్రిలో 20 రోజుల క్రితం చేరిన ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో, ఆసుపత్రిలో పని చేస్తున్న 81 మందిని క్వారంటైన్ చేయాల్సి వచ్చింది. వీరిలో ఓ డాక్టర్ కు, ముగ్గురు నర్సులకు, హౌస్ కీపింగ్ స్టాఫ్ లో ఒకరికి ఇప్పటికే వైరస్ పాజిటివ్ రావడం గమనార్హం.
ప్రస్తుతం ఢిల్లీలోని అన్ని ఆసుపత్రుల్లోనూ కరోనా లక్షణాలు లేకుంటేనే లోనికి పంపుతున్నారు. వారి ట్రావెల్ హిస్టరీని పరిశీలిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు లేకుంటేనే ఓపీ సేవలు అందిస్తున్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే, తొలుత క్వారంటైన్ సెంటర్లకు, పరీక్షల తరువాత పాజిటివ్ వస్తే, ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.

లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో హెల్త్ కేర్ వర్కర్లు బయట తిరగడం కూడా వారికి కరోనా సోకడానికి కారణమైందని నిపుణులు భావిస్తున్నారు. "ఇప్పటివరకూ ఇళ్లల్లో ఉన్న వారు ఎవరికీ కరోనా సోకలేదు. డాక్టర్లు, నర్సులు, హెల్త్ వర్కర్లూ బయట తిరుగుతూ ప్రజలను కలుస్తున్నారు. అందుకే వారికి ఇన్ఫెక్షన్ అధికంగా సోకుతోంది. వీరు పరిశీలించిన వారిలో 20 నుంచి 30 శాతం మందికి జ్వరం, దగ్గు లేకపోయినా, వారి నుంచి కరోనా వైరస్ వ్యాపిస్తోంది" అని సఫ్దర్ జంగ్ ఆసుపత్రి కమ్యూనిటీ మెడిసిన్ విభాగం హెడ్ డాక్టర్ జుగల్ కిశోర్ వ్యాఖ్యానించారు. వైద్యులంతా రక్షణ సూట్ లను ధరించి మాత్రమే ఏ రోగి వద్దకైనా వెళ్లాలని సలహా ఇచ్చారు. ఆసుపత్రులకు వచ్చేవారు మాస్క్ లను ధరించాలని కోరారు.