నెల్లూరులో జగన్ చెలగాటం! ‘వారి’ టికెట్ ఆశలకి ప్రాణ సంకటం!

పిల్లికి చెలగాటం… ఎలుకకి ప్రాణ సంకటం… ఈ సామెత పాతదే! కానీ, దాని ప్రభావం మాత్రం ఎప్పటికప్పుడు కొత్తగానే వుంటుంది. ఇంతకీ ఇప్పుడు ఎలుకలుగా మారింది ఎవరు అటారా? అది తెలియాలంటే అసలు చెలగాటం ఆడుతున్న పిల్లెవరో తెలుసుకోవాలి కదా!

 

 

వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్ నెల్లూరులో చెలగాటం మొదలు పెట్టారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో వుండి తరువాత టీడీపీలోకి వచ్చి… తాజాగా జగన్ శిబిరం చేరిన ఆనం రామనారాయణ రెడ్డి కలకలానికి కారణమయ్యారు. నెల్లూరులో ఆనం ఫ్యామిలి పట్టు అందరికీ తెలిసిందే. అదే జగన్ చేత మాజీ మంత్రి రామనారాయణ రెడ్డికి స్వాగతం పలికించింది. కానీ, ఆనంకి అందిన ఆహ్వానం ఇప్పుడు నెల్లూరులొని అసలు వైసీపీ నాయకులకి దిమ్మ తిరిగిపోయేలా చేస్తోంది. ఎన్నికలు అంతకంతకూ దగ్గరపడుతోన్న వేళ తమకు ఈ ఆనం గండమేంటని వారు వాపోతున్నారు!

 

 

ఆనం రామనారాయణ రెడ్డి లాంటి పెద్ద నేతలు పార్టీ మారితే దాని ఎఫెక్ట్ ఎక్కువగానే వుంటుంది. కాంగ్రెస్ హయాంలో ఆర్దిక మంత్రిగా చేసిన ఆయన ఒక దేశలో సమైక్యాంధ్రకు సీఎం కూడా అవుతారని అన్నారు. అంత రేంజ్ కలిగిన ఆయన రాష్ట్ర విభజనతో హస్తం పార్టీలాగే కుదేలయ్యారు. నాలుగేళ్లుగా మాజీ ఎమ్మెల్యే, మంత్రి అనిపించుకుంటూ కొనసాగుతున్నారు. ఈ మధ్యే ఆనం సోదరుడు వివేకానంద రెడ్డి మరణించటం కూడా వారి కుటుంబంలో విషాదం నింపింది. ఇటువంటి తరుణంలో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని ఆనం రామనారాయణ ప్రయత్నిస్తున్నారు. కారణాలు ఏవైనా టీడీపీని వదిలి వైసీపీకి చేరువైన ఆయన బలమున్న ఆత్మకూరు నియోజక వర్గం అడిగినప్పటికీ కుదరదని తేల్చేశారట జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యేలు , ఎంపీ వున్న స్థానాల్లో ఆనంకు అవకాశం లేదని తేలిపోయిందట. ఆత్మకూరు కాకుండా వెంకటగిరి తీసుకొమ్మని జగన్ అన్నట్టు పొలిటికల్ టాక్! ఆత్మకూరులో ఆనం అంటే మేకపాటి కుటుంబం తాము ఏకంగా వైసీపీ వదిలి పెడతామని హెచ్చరించిందని కూడా అంటున్నారు. మేకపాటి ఫ్యామిలిని వదులుకునే పిచ్చి ప్రయత్నాలేవీ జగన్ చేయరు కాబట్టి ఆనం రామనారాయణ రెడ్డి అంతగా పట్టులేని వెంకటగిరికే పరిమితం కావాలి.

 

 

జగన్ చెప్పినట్టు వెంకటగిరి నుంచి పోటీ చేసినా ఆనం ఎఫెక్ట్ మరో ఇద్దరు వైసీపీ నాయకుల మీద పడనుందట. నాలుగేళ్లుగా తమకు టికెట్ గ్యారెంటీ అంటూ వారిద్దరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాను రెక్కలు పట్టుకుని జోరుగా తింపుతూ వచ్చారు. వెంకటగిరి నియోజక వర్గంలో బొమ్మిరెడ్డి  రాఘవేంద్రా రెడ్డి, కలిమిలి రాంప్రసాద్ రెడ్డి అనేక ప్రజా కార్యక్రమాల్లో స్వంత డబ్బుతో పాలుపంచుకుంటూ వచ్చారు తీరా ఇప్పుడు ఆనం చేరిక ఆటంబాంబులా వారి ఆశల్ని ఛిన్నాభిన్నం చేసేస్తోందట! ఆనం వెంకటగిరి నుంచీ పోటీ చేస్తే బొమ్మిరెడ్డి, కలిమలి ఇద్దరూ పోటీకి దూరంగా వుండాల్సిన స్థితి వస్తుంది. నాలుగేళ్లుగా వారు చూసిన సహనానికి, పార్టీ విధేయతకి ఇలాంటి ఫలితం దక్కటం నిజంగా విషాదమే!

ఇప్పటికైతే ఆనం ఏ స్థానం నుంచీ పోటీ చేస్తారని జగన్ చెప్పలేదు. ఆనం కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ, ఆనం నెల్లూరులో ఎక్కడ నుంచీ పోటీ చేసినా ఆయనకంటే ముందు నుంచీ వున్న వైసీపీ నేతలు ఎవరికో ఒకరి ప్రాణ సంకటమే! చూడాలి మరి జగన్ ఈ చెలగాటాన్ని ఎలా ఆడతారో!