ఒలింపిక్స్లో సంచలనం.. రజతం సాధించిన నీరజ్!
Published on: Fri Aug 9, 2024 5:19AM
భారత స్టార్ అథ్లెట్, జావెలిన్ త్రో క్రీడాకారుడు నీరజ్ చోప్రా ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియాకి రజత పతకం సాధించిపెట్టాడు. గురువారం రాత్రి జరిగిన జావెలన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సంపాదించాడు. నీరజ్ తన రెండో ప్రయత్నంలో 89.45 మీటర్లో త్రో చేసి మొత్తం పన్నెండు మందిలో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ క్రీడాకారుడు నదీమ్ అర్షద్ 92.97 మీటర్లు విసిరి స్వర్ణ పతకం సాధించాడు. గ్రెనడా అథ్లెట్ పీటర్ అండర్సన్ 88.54 మీటర్లు విసిరి కాంస్యం సాధించాడు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి కూడా స్వర్ణం సాధిస్తాడన్న అంచనాలు వున్నప్పటికీ, పాకిస్థాన్ క్రీడాకారుడు అనూహ్యమైన ప్రతిభను ప్రదర్శించడంతో నీరజ్ రజతానికి పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇది తక్కువ విజయమేమీ కాదు. ఈ రజతం సాధించడం ద్వారా ఒలింపిక్స్లో వరుసగా రెండు పతకాలు సాధించిన భారత క్రీడాకారుడిగా నీరజ్ రికార్డు సృష్టించాడు.
నీరజ్ చోప్రా ఒలింపిక్స్లో రజత పతకం సాధించడం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘నీరజ్ చోప్రా అద్భుతమైన వ్యక్తి. మళ్ళీ తన ప్రతిభను చాటాడు. అతను మరో ఒలింపిక్ మెడల్తో భారత్ గర్వించేలా చేశాడు. రజతం సాధించిన నీరజ్కి అభినందనలు. భవిష్యత్తులో అథ్లెట్లు తమ కలలను నెరవేర్చుకోవడానికి, ఇండియా గర్వపడేలా చేయడానికి నీరజ్ స్ఫూర్తి కొనసాగుతూనే వుంటుంది’’ అని తన ఎక్స్ అకౌంట్లో పోస్టు పెట్టారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఎక్స్ అకౌంట్లో ‘‘చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రాకి అభినందనలు. వరుస ఒలింపిక్స్లో బంగారు, వెండి పతకాలు సాధించిన తొలి అథ్లెట్గా రికార్డు సృష్టించిన నీరజ్ని చూసి ఇండియా గర్విస్తోంది. రాబోయే రోజుల్లో ఇండియాకు అతను మరిన్ని పతకాలు, కీర్తి తీసుకురావాలని దేశం ఎదురుచూస్తోంది’’ అని మెసేజ్ పెట్టారు.


