5వేల చేరువలో కరోనా కేసులు.. ఏపీలో కల్లోలం!,, సంక్రాంతి టెన్షన్..
Published on: Sat Jan 15, 2022 6:15PM
ఏపీలో జగన్‌కంటే దూకుడుగా దూసుకుపోతున్నాయి కరోనా కేసులు. రోజురోజుకూ 500-1000 వరకూ పెరుగుతున్నాయి కేసులు. గడచిన 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 4,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనాతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. కరోనా బారి నుంచి 397 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 22,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు పెరుగుతుండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది.
సంక్రాంతి కారణంగానే పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బంధువులు, స్నేహితులు ఏపీకి రావడం.. అంతాకలిసి సందడిగా సంక్రాంతి వేడుకల్లో బిజీగా ఉండటం.. ఇదే ఛాన్స్‌గా కరోనా సైతం పండుగ చేసుకుంటుండటం ఆందోళనకర అంశం. ప్రజలు సంతోషంగా గడుపుతూనే.. తగిన జాగ్రత్తలతో సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.


