TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చైనాను అధిగమించిన ఇండియా.. ఏ రంగంలోనంటే?

Published on: Thu Jul 9, 2026 2:33PM

 

రక్షణ రంగంలో ఇండియా ఒక తిరుగులేని శక్తిగా వేగంగా ఎదుగుతోంది.  ఒకప్పుడు కేవలం ఆయుధాల దిగుమతులపైనే ఆధారపడినఇండియా,  ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ పవర్‌హౌస్‌గా అవతరించింది.   అంతర్జాతీయ నివేదికలు,  రక్షణ రంగ తాజా విశ్లేషణల మేరకు,  ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైనిక దళాల జాబితాలో భారత్ మూడవ స్థానానికి దూసుకెళ్లింది. అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో నిలవగా, అత్యాధునిక యుద్ధ పరిజ్ఞానం కలిగిన రష్యా రెండో స్థానంలో ఉంది. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, ఇప్పటివరకు మూడో స్థానంలో కొనసాగుతూ వచ్చిన చైనాను అధిగమించి ఇండియా ఈ ఘనత సాధించింది. 

డబ్ల్యూడిఎంఎంఏ సంస్థ తాజాగా ప్రకటించిన  వార్షిక ర్యాంకింగ్ ల  మేరకు ఇండియా  మూడో స్థానంలో  నిలిచింది. ఆధునీకరణ.. లాజిస్టికల్ మద్దతు.. పరస్పరంగా చేసే దాడులు.. రక్షణ సామర్థ్యాలు వంటి  వాటి ఆధారంగా డబ్ల్యూడిఎంఎంఏ  ఈ రేటింగ్ ఇచ్చింది. ప్రత్యేకమైన మిషన్, ప్రత్యేకమైన బాంబర్ దళం, సిఏఎస్ శిక్షణ.. వంటి వాటిని డబ్ల్యూ డి ఎం ఎం ఏ ఈ ర్యాంకింగ్ లకు ప్రాతిపదికగా తీసుకుంది.  గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఇండియా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచుకుంటూ వస్తోంది.

స్వయంసమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన  ఆత్మనిర్భర్ భారత్ విధానం దేశ రక్షణ రంగానికి కొత్త ఊపిరి పోసింది. గతంలో  విదేశాల నుంచి యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, క్షిపణులను కొనుగోలు చేసే ఇండియా, ఇప్పుడు  మేక్ ఇన్ ఇండియా, స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన తేజస్ యుద్ధ విమానాలు, ఐఎన్‌ఎస్ విక్రాంత్ వంటి భారీ విమాన వాహక నౌకలతో తర రక్షణ రంగాన్ని పటిష్టం చేసుకుంది. అలాగే బ్రహ్మోస్ క్షిపణుల వంటి అత్యాధునిక ఆయుధాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదిగింది. ఈ వ్యూహాత్మక మార్పులే అంతర్జాతీయ వేదికపై భారత్ కు డబ్ల్యూడిఎంఎంఏ    రేటింగ్లో మూడో స్థానంలో నిలవడానికి దోహదం అయ్యింది. 

ఇక పోతే మూడో స్థానం చైనా చేజారడం వెనుక ఆ దేశం ఎదుర్కొంటున్న పలు అంతర్గత   సమస్యలు ఉన్నట్లు రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనా తన సైనిక ఆధునీకరణ కోసం బిలియన్ల కొద్దీ డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ..  వారి ఆయుధాల నాణ్యతపై అంతర్జాతీయంగా అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే ఆ దేశ సైన్యంలో అవినీతి, అంతర్గత కుమ్ములాటలు కూడా వారి సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. సరిహద్దుల్లో నిరంతరం ఉద్రిక్తతలు సృష్టిస్తూ..  పొరుగు దేశాలను భయభ్రాంతులకు గురిచేయాలనే చైనా దురాక్రమణ వ్యూహాలకు భారత సైన్యం గల్వాన్ లోయ వంటి ప్రాంతాల్లో దీటైన సమాధానం ఇచ్చింది. భారత్ సాధించిన ఈ రక్షణ రంగ విజయాలు కేవలం  దేశ సరిహద్దులకే పరిమితం కాకుండా, హిందూ మహాసముద్ర ప్రాంతంలో, ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతిభద్రతలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అమెరికా, రష్యా వంటి పెద్ద దేశాలు సైతం ఇప్పుడు భారత్‌తో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.

భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్‌లను ఆధునీకరించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. అధునాతన డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రక్షణ వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడం ద్వారా భారతదేశం భవిష్యత్  యుద్ధాలకు సిద్ధంగా ఉంది. చైనాతో పోలిస్తే భారత సైన్యానికి ఉన్న విస్తృతమైన యుద్ధ అనుభవం, కఠినమైన పర్వత ప్రాంతాలలో పోరాడగల నైపుణ్యం  సానుకూలాంశంగా మారింది. ఈ గ్లోబల్ డిఫెన్స్ ర్యాంకింగ్స్ మార్పుతో  ఇప్పుడు చైనా విస్తరణను అడ్డుకోవడానికి భారత్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచిందని అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. 

India surpassed China, defence ranking, global military power, india beats china, strongest armies in the world