రైతులపై జాగ్రతగా మాట్లాడు! సచిన్ కు పవార్ కౌంటర్
Published on: Sun Feb 7, 2021 9:17AM
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనపై అంతర్జాతీయంగా చర్చ జరగుతోంది. పాప్ స్టార్ రిహన్నా భారత రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్ పై రగడ జరుగుతూనే ఉంది. రిహన్నా ట్వీట్ కు భారత్ కు చెందిన పలువురు ప్రముఖులు కౌంటరిచ్చారు. అందులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూడా ఉన్నారు. సచిన్ వ్యాఖ్యలు వైరల్ కాగా.. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సచిన్ ను టార్గెట్ చేశారు. ఏదైనా మరో రంగం గురించి మాట్లాడే ముందు సచిన్ కొంచెం జాగ్రత్తగా ఉండాలని శరద్ పవార్ కామెంట్ చేశారు.
రైతుల నిరసనల వెనుక ఖలిస్థానీలు లేదా ఉగ్రవాదులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలపై కూడా పవార్ విమర్శలు గుప్పించారు. నిరసనకారులంతా రైతులేనని ఆయన స్పష్టం చేశారు. వారంతా దేశానికి అన్నం పెడుతున్న వారని, వారిని ఖలిస్థానీలు, ఉగ్రవాదులు అనవద్దని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.రైతుల గురించి మాట్లాడేముందు అన్ని ఆలోచించాలని శరద్ పవార్ సూచించారు.


