నక్సలైట్ల తొలి రక్తపు చుక్కకి… 50ఏళ్లు!

 

ఈ తరం స్మార్ట్ ఫోన్లు, ఫేస్బుక్ లు, ట్విట్టర్ ఖతాల యువతకి నక్సలైట్లు అంటే అడవుల్లో తుపాకులు పట్టుకుని తిరిగే అన్నలని తెలుసు. వాళ్లకీ, పోలీసులకి, ప్రత్యేక భద్రతా దళాలకి మధ్య ఎన్ కౌంటర్లు నడుస్తుంటాయని కూడా తెలుసు. కాని, చాలా మంది భారతీయ యువతకి నిజంగా తెలియంది ఏంటంటే… ఈ నక్సలైట్లు ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరిపైన పోరాటం చేస్తున్నారని! మావోయిస్టు సాయుధ పోరాటం మంచిదనే వారు, నిరుపయోగం అనేవారు, అనర్థం అనే వారు… ఇలా చాలా మంది వుంటారు. కాని, 50ఏళ్లు నిండిన నక్సల్ బరి హింసాత్మక పోరు… ఎందుకు మొదలైంది? ఎక్కడి దాకా వచ్చింది? ఎటు వెళ్లబోతోంది?

 

రెడ్ టెర్రర్… అంటే వామపక్ష ఉగ్రవాదం… ఇప్పుడు కేంద్రం ముందు వున్న అతి పెద్ద సవాళ్లలో ఒకటి. పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టుల మాదిరిగానే వీరిని కూడా ఆయుధాలతో అణిచేయాలని చూస్తోంది ఇండియన్ గవర్నమెంట్. కాని, జిహాద్ పేరుతో మతోన్మాదం నిండిన ఉగ్రవాదులు వేరు, పేదల కోసం, గిరిజన , ఆదివాసీల కోసం ప్రాణాలు అర్పించే నక్సలైట్లు వేరు. అందర్నీ ఒకే గాటన కట్టేయటం పొరపాటే అవుతుంది. అయితే, అమాయక జనం ప్రాణాలు తీసే ఉగ్రవాదుల్లాగే నక్సల్స్ కూడా హింసకు పాల్పడుతుండటం సామాన్య ప్రజల్లో వారిపట్ల సరైన అవగాహన, సానుభూతి లేకుండా చేస్తోంది! సరిగ్గా అర్థ శతాబ్దం కింద బెంగాల్ లోని నక్సల్ బరి అనే ఊళ్లో మొదలైంది ఈ సాయుధ పోరాటం. ఏదో స్వార్థం కోసం కాదు. పేద రైతుల భూమి హక్కు కోసం…

 

బెంగాల్ లోని డార్జిలింగ్ దగ్గరలో వున్న నక్సల్ బరి గ్రామంలో ఇవాళ్టి రోజునే రైతులు జమీన్ దార్ల ఆగడాలపై కదం తొక్కారు. ఆ క్రమంలో ఒక పోలీస్ వారి చేతిలో చనిపోయాడు. ఫలితంగా పోలీసుల చేతిలో పదకొండు మంది మృత్యు వాత పడ్డారు. 1967, మే 25న మొదలైన ఆ రక్తస్రావం ఇంకా ఆగటం లేదు. పదే పదే మావోలు భద్రతా దళాలపై పై చేయి సాధిస్తుంటే అంతే కర్కశంగా పోలీసులు, జవాన్లు అడవిలో అన్నల్ని అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. 50ఏళ్ల నక్సల్ హింసాత్మక ప్రస్థానంలో గత 20ఏళ్లలోనే 20వేల మంది ప్రాణాలు కోల్పోయారంటే… దారుణం ఎంతగా జరిగిందో గ్రహించవచ్చు.

 

ఒకప్పుడు బెంగాల్ లోని నక్సల్ బరిలో మొదలైన సాయుధ విప్లవం దేశమంతా వ్యాపించింది. పంజాబ్ నుంచీ ఆంధ్ర ప్రదేశ్ దాకా అనేక రాష్ట్రాలు అన్నల చేతుల్లోని తుపాకులకి గడగడలాడాయి. కాని, అంతే వేగంగా నక్సల్ బరి ఉద్యమం చావు దెబ్బతిన్నది కూడా. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు కర్కశంగా, కఠినంగా ఎర్ర దండుని అణిచేశాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీజేపి, చివరకు సీపీఎం … అందరిదీ ఒకే దారి! ఆయుధానికి ఆయుధంతోనే సమాధానం…

 

50ఏళ్లుగా జనం కోసం పోరాడుతోన్న నక్సలైట్లు అదే జనంలోని కొందర్ని ఇన్ ఫార్మర్లు అంటూ కాల్చి చంపటం, పోలీసుల్ని గెరిల్లా పద్ధతుల్లో బలి తీసుకోవటం, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ, అభివృద్ధిని నిరోధిస్తూ… తద్వారా ఏ జనానికి మేలు జరగాలో వారికే అడ్డుగా మారటం… ఇవన్నీ చేశారు! కాని, అయిదు దశాబ్దాల తరువాత వారి పంథా ఎక్కడో పక్కదోవ పట్టిందని ఇవాళ్ల చాలా మంది భావిస్తుంటారు. మావోయిస్టు పార్టీగా వున్న ప్రస్తుత నక్సలైట్లు దళం ఇంకా చాలా మంది లెఫ్టు మేదావులకి, ఉద్యమకారులకి అమోదయోగ్యమే. వారి వల్ల మాత్రమే భారతదేశం నిజంగా బాగుపడుతుందని వీరు భావిస్తుంటారు. కాని, ప్రపంచీకరణ నేపథ్యంలో ఐటీ ఉద్యోగాల రేసులో క్షణం తీరికలేని యువత సాయుధ పంథాని ఏమంత పెద్దగా సమర్థించినట్టు కనిపించటం లేదు. అందుకే, మావోయిస్టు పార్టీలో చేరికలు క్రమంగా తగ్గుతున్నాయి. రోజు రోజుకు అడవిలోని అన్నల అస్థిత్వం కష్టతరం అవుతోంది.

 

మార్క్స్ చెప్పాడు. మావో ఆచరించాడు. అక్కడక్కడా చేగు వేరా, ఫిడెల్ క్యాస్ట్రో లాంటి వారు కూడా సాయుధ పోరాటంతో విజయం సాధించారు. సోవియట్ ఒకప్పుడు కమ్యూనిస్టు వెలుగులతో మెరిసిపోయింది. కాని, మిగతా ప్రపంచం అంతా మన నక్సలైట్లు చెబుతోన్న సిద్ధాంతాన్ని సీరియస్ గా తీసుకోలేదు. మన దేశంలోనూ అదే జరుగుతూ వస్తోంది. మావోయిస్టుల ఆశయాలు సమర్థించే వారు కూడా హింసని ఒప్పుకోలేకపోతున్నారు. అంతకన్నా ఓట్ల యుద్ధంలో గెలిచిన వారి నుంచే ఎంతో కొంత మార్పు ఆశిస్తున్నారు. అదీ కాక కులం, మతం, ప్రాంతం, భాషా లాంటి అనేక భిన్నత్వాలు, భిన్నాభిప్రాయాలు వున్న మన దేశంలో కోట్లాది మంది మూకుమ్ముడిగా సాయుధ పోరాటం చేస్తారని ఆశించటం అత్యాశే అవుతుంది. బ్రిటీష్ వారికి కూడా మనం ఏనాడూ ఐకమత్యంగా సాయుధ సమాధానం ఇవ్వలేకపోయామన్నది నిజం. అహింసాయుత మార్గాలే ఎక్కువ ఫలితాన్నిచ్చాయి. ఈ సత్యాన్ని , మన దేశ ప్రత్యేక సామాజిక, రాజకీయ పరిస్థితుల్ని మావోయిస్టులు గుర్తించాలి. 50ఏళ్లైనా తాము తమ అంతిమ లక్ష్యానికి ఏ మాత్రం దగ్గరగా వెళ్లలేకపోవటానికి బోలెడు కారణాలు దొరుకుతాయి.

 

రాజ్యాంగ వ్యతిరేకమైన హింసాత్మక మార్గం వదలాలా వద్దా అనేది నక్సల్స్ ఇష్టం. కాని, ఎన్నో ప్రాణాలు పణంగా పెట్టి అత్యంత తక్కువ స్థాయిలో విజయాలు సాధించుకోవటం ఖచ్చితంగా తెలివైన యుద్ధనీతి కాదు. దీనిపై మాత్రం 50ఏళ్లు నిండిన సాయుధ ఉద్యమం తప్పకుండా మనసు పెట్టి విశ్లేషించుకోవాలి!