సంక్షోభంలో పాకిస్తాన్

పొరుగు దేశం పాకిస్తాన్ సంక్షోభంలో పడింది. అగ్ర నాయకుల అరెస్టులు ఒకవైపు... ఉగ్రవాదుల పంజా మరోవైపు పాకిస్తాన్‌ను  కలవరపెడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీష్‌ను, ఆయన కుమార్తె మరియంలను లాహోర్ విమానాశ్రయంలో పాకిస్తాన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. లండన్‌లో చికిత్స పొందుతున్న ఆమెను చూసేందుకు షరీఫ్ తన కుమార్తె మరియంతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో పాకిస్తాన్ చేరుకున్నారు. వారిద్దరు అబుదాబీ మీదుగా లాహోర్ చేరుకోగానే అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశంలో సంచలనం రేపుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నవాజ్ షరీఫ్‌కు తాను అరెస్టు అవుతానని ముందుగానే తెలుసు. అయినా ఆయన వాటి నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇది ఆయనలో ఉన్న ధైర్యానికి ప్రతీక.

 

 

నవాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతి సొమ్ముతో లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న అవెన్‌ఫీల్డ్‌లో నాలుగు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారని అభియోగం. ఈ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు.  అయితే ఈ అపార్ట్‌మెంట్లేవీ నవాజ్ షరీఫ్ పేరిట లేకపోవడం గమనార్హం. తన ఎన్నికల అఫిడివిట్‌లో ఈ ఆస్తులను చేర్చలేదని పాక్ ప్రభుత్వం షరీఫ్‌పై కేసులు పెట్టింది. ఈ అక్రమాస్తుల విలువ 65 కోట్ల రూపాయలు.పాకిస్తాన్‌లో త్వరలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అరెస్టులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతదేశంతో పోలీస్తే 65 కోట్ల రూపాయల అక్రమార్జన ఏమంత పెద్దది కాదు. ఇంతటి అవినీతి భారత్‌లో సాధారణ గ్రామ లేదూ పట్టణ స్ధాయి నాయకులు చేస్తారు. అయితే పాకిస్తాన్‌లో మాత్రం ఇది పెద్ద నేరంగానే పరిగణించడం విశేషం.

 

 

నవాజ్ షరీఫ్ అరెస్టును అవినీతి కోణం నుంచి కాకుండా రాజకీయ కోణం నుంచి మాత్రమే చూడాలి. త్వరలో ఎన్నికలు జరుగుతున్న వేళ మాజీ ప్రధాని, దేశంలోనే సీనియర్ నాయకుడైన నవాజ్ షరీఫ్‌ను అరెస్టు చేయడం ముమ్మాటికి రాజకీయ కుట్రగానే సభ్య దేశాలు చూస్తున్నాయి. తనను అరెస్టు చేస్తారని ముందుగానే తెలిసినా... ఆ సమయానికి షరీఫ్ లండన్‌లో ఉన్నా ఆయన పారిపోవడానికి కాని, మరోచోట తలదాచుకోవడానికి కాని ప్రయత్నించలేదు. భార్య ఆరోగ్య పరిస్థితిని స్వయంగా చూపి.. ఆమెను సముదాయించి కుమార్తెతో సహా స్వదేశానికి బయలుదేరారు. ఇది కూడా రాజకీయ ఎత్తుగడలో భాగంగానే చూడాలి.

అయితే భారత్‌తో పోలిస్తే మాత్రం అరెస్టు అవుతానని తెలిసీ ఇలా రావడం మాత్రం ఆశ్చర్యమే. పాకిస్తాన్‌లో  ఒకవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అరెస్టు అయితే మరోచోట పెషావర్‌లో విషాదం చోటుచేసుకుంది. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న వేళ ఉగ్రవాదులు మానవబాంబుతో ఓ పార్టీ చేపట్టిన ర్యాలీపై దాడి చేశారు. ఈ దాడిలో ఏకంగా 128 మంది అమాయకులు బలైపోయారు.

 

 

పాకిస్తాన్‌లో అంతో ఇంతో పేరున్న పార్టీగా పేరున్న బలూచిస్థాన్ అవామీ పార్టీ నాయకుడు సిరాజ్ రైసానీ మరణించారు. నిజానికి ఉగ్రవాదుల దాడి ఆయన లక్ష్యంగానే జరిగిందని అంటున్నారు. ఎవరిది ఏ లక్ష్యమైనా జరిగింది మాత్రం మహా ఘోరం. దారుణం. వందల మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు ఈ మారణహోమం వల్ల ఏమి సాధించారో మాత్రం అర్ధం కాదు. ఒకరినో.. పదిమందినో.. వందల మందినో హతమార్చడం ద్వారా అధికారంలోకి వస్తామని కాని, ఆ దేవుడు కరుణిస్తాడని కాని అనుకోవడం ముమ్మాటికి ముర్ఖత్వమే. ఇలాంటి చర్యలకు వారి దేవుడే కాదు... ఏ దేవుడైనా హర్షించడు. ఈ సత్యం ప్రపంచంలోని ఉగ్రవాదులందరికీ ఎంత త్వరగా తెలిస్తే మానవాళి మనుగడకు అంత ప్రశాంతత దొరుకుతుంది.