సోనియా మీద నట్వర్‌సింగ్ బుక్ బాంబ్!

 

కేంద్ర మాజీ కేంద్రమంత్రి నట్వర్‌సింగ్ ఆత్మకథ రూపంలో బుక్ బాంబ్ పేల్చారు. ఈ పుస్తకంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లోగుట్టు రట్టు చేశారు. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన నట్వర్ సింగ్ రాసిన ఆత్మకథ ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఇనఫ్’ త్వరలో విడుదల కానుంది. నట్వర్ సింగ్ తన పుస్తకంలో వెల్లడించిన రహస్యాలలో కొన్ని...

 

1. 1991లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. సోనియాగాంధీ తమకు విధేయుడిగా వుండే శంకర్‌దయాళ్ శర్మను ప్రధానిగా చేయాలని అనుకున్నారు. అయితే శంకర్‌దయాళ్ శర్మ తన అనారోగ్యం కారణంగా ప్రధాని పదవి స్వీకరించడానికి ఒప్పుకోలేదు. దాంతో పీవీ నరసింహారావుకు ప్రధాని అయ్యే అవకాశం దక్కింది.

 

2. ప్రధాని అయ్యే వరకూ పీవీ నరసింహారావు గురించి సోనియాకేమీ తెలియదు. ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య ఎప్పుడూ సత్సంబంధాలు లేవు.

 

3. 2004 సంవత్సరంలో సోనియాగాంధీ ప్రధాని పదవిని త్యాగం చేసిందని, ఆమె అంతరాత్మ ప్రధాని కావొద్దని చెప్పిందని ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ నిజానికి సోనియాగాంధీ ప్రధాని కాకుండా ఆమె కుమారుడు రాహుల్ గాంధీయే చాలా తీవ్రంగా అడ్డుకున్నారు. తన తండ్రి, నాయనమ్మ తరహాలోనే తల్లి కూడా తీవ్రవాదుల చేతిలో మరణిస్తుందన్న భయంతోనే రాహుల్ అడ్డుపడ్డారు. కొడుకుగా రాహుల్‌కి పూర్తి మార్కులు వేయవచ్చు.

 

4. తమకు సంబంధించిన విషయాలను నా ఆత్మకథలో రాయొద్దని కోరుతూ సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియంక గాంధీ ఈ ఏడాది మే 7వ తేదీన మా ఇంటికి వచ్చారు. అయితే నా ఆత్మకథలో అన్ని విషయాలనూ ఉన్నవి ఉన్నట్టుగా వెల్లడించాలని భావించాను.

 

5. చమురు కుంభకోణంలో ఇరుక్కుని నేను నా మంత్రి పదవికి రాజీనామా చేశాను. అయితే యుపిఎ ప్రభుత్వం ఈ కుంభకోణం విషయంలో నన్ను బలిపశువును చేసింది.

 

6. ఇటీవల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు ప్రధాని కార్యాలయం విషయంలో వెల్లడించిన విషయాలు వాస్తవాలే.