సాహస బాలలు వీరే

ఎదుటి వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు సాధ్యమైనంతలో వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం.. తాను మనిషినే అన్న విచక్షణ.. మానవత్వం గురించి తెలిసే వయసులో ఇలాంటి ఆలోచన రావడం సహజం.. కానీ ఆటపాటలతో, అల్లరితో మానవత్వం వంటి పెద్ద పెద్ద పదాలు తెలియని బుజ్జాయిలు సాయం చేస్తే.. సాయం చేస్తూ ప్రాణాలు కోల్పోతే.. నిజంగా గొప్ప విషయం కదా..!! అందుకే ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు, తమ ప్రాణాలను సైతం తెగించి నిస్వార్థంతో, ధైర్యసాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం జాతీయ సాహస బాలల పురస్కారాలను ప్రవేశపెట్టింది. ఈ అవార్డులను పొందిన బాలలకు ఒక మెడల్‌నూ, సర్టిఫికేట్‌నూ, క్యాష్‌ అవార్డ్‌తో కలిపి ప్రదానం చేస్తారు.

 

'భారత్‌' అవార్డ్‌ గెలుపొందినవారికి గోల్డ్‌ మెడల్‌నూ, మిగిలిన ఇతర అవార్డులను పొందినవారికి సిల్వర్‌ మెడల్స్‌నూ అందిస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందినవారికి నగదుపురస్కారంతో పాటూ, వారి చదువు కోసం ప్రోత్సాహకాలను, ఉపకార వేతనాలనూ ప్రభుత్వం అందిస్తుంది. వీరి నుంచి స్పూర్తి పొంది మిగిలిన చిన్నారులు కూడా సాయానికి.. సాహసానికి ముందుకొచ్చేలా చేయాలన్నది ప్రభుత్వం ఆలోచన? ఎప్పటిలాగే ఈ సారి కూడా 18 మంది బాలబాలికలు సాహస బాలల అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ఒక్కొక్కొరిది ఒక్కో నేపథ్యం. వీరిందరిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నజియా సాహసం ప్రత్యేకమైనది. అసలు ఆమె ఏం చేసింది..? ఎందుకు ఆమె సాహస బాలల అవార్డుకు ఎంపిక చేశారు.. చూస్తే.. ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి తొలి నుంచి ఆగ్రా వీధుల్లో సాహసబాలికగా పేరు తెచ్చుకుంది. రెండేళ్ల క్రితం ఈమె చేసిన సాహసం దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.

 

ఎప్పటిలాగే కాలేజ్‌కు వెళుతున్న నజియాకు ఎక్కడ్నుంచో హెల్ప్.. హెల్ప్ అంటూ ఓ ఆడపిల్ల అరుపులు వినిపించాయి. ఆ కేకలు నజియా ఒక్కదానికే కాదు చుట్టూ ఉన్న ఎంతోమంది చెవులను తాకాయి. కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆపదలో ఉన్న అమ్మాయి హిందూ మతానికి చెందిన అమ్మాయి. అప్పటికే ఆ కాలనీలో హిందువులకు, ముస్లింలకు పడేది కాదు. రోజు ఏదో ఒక చోట తగవులు జరుగుతూనే ఉండేవి. అందుకే హిందూ మతానికి చెందిన ఆ అమ్మాయి ఆపదలో ఉన్నా చూసీ చూడనట్లు వదిలేశారు. కానీ నజియా అలా ఆలోచించలేదు.. ఇద్దరు కిడ్నాపర్లు ఆ బాలికను మోటార్ సైకిల్‌పైకి లాగుతున్నారు. ఆ క్షణంలో ఏమీ ఆలోచించకుండా వెంటనే ఆ బాలిక చేయి పట్టుకుని లాగుతూ.. కొద్దిసేపు వారితో పెనుగులాడింది. ఈ లోపు వీరి కేకలకు జనం గుమిగూడుతుండటంతో కిడ్నాపర్లు తోకముడిచారు. ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి తమ కూతురిని కాపాడిన నజియాకు ఆ బాలిక కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న నాటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ నజియాను అభినందించి సాహస బాలికగా అవార్డు అందజేశారు.

 

ఇది జరిగిన కొద్దిరోజుల తర్వాత అఖిలేష్‌కు నజియా నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ఆగ్రాలోని మంటోలా ఏరియాలో ఓ గ్యాంబ్లింగ్ బ్యాచ్ మట్కా సెంటర్‌ను నిర్వహిస్తున్నారని.. ఇది చూసిన తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అలా చేసినప్పటి నుంచి పోలీసులు, గ్యాంబర్లు కలిసి తనను వేధిస్తున్నారని.. తన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తున్నారని అఖిలేష్‌కు ట్వీట్ చేసింది. వెంటనే స్పందించిన అఖిలేష్ వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. అలా ఈ ముఠా ఆటకట్టించే క్రమంలో సంఘవిద్రోహ శక్తులకు ఎదురొడ్డి నిలిచి ఎందరిలోనో స్పూర్తి నింపింది. అందుకే ఆమను సాహసబాలిక అవార్డుతో పాటు ప్రతిష్టాత్మక "భారత్" అవార్డుకు ఎంపిక చేసింది కేంద్రప్రభుత్వం. సో.. ఫ్రెండ్స్‌ చిన్నపిల్లలమని.. ఏం చేయలేనివారమని అనుకోకుండా ఈ నజియా లాగే ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ.. అన్యాయాన్ని ఎదుర్కొందామా మరి.

నేత్రావతి ఎం. చవాన్
కర్నాటకలోని బాగల్‌కోట్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల నేత్రావతి ఎం చవాన్‌ నీటిలో మునిగిపోతున్న ఇద్దరు బాలలను కాపాడేందుకు తన ప్రాణాలను త్యాగం చేశారు. తొలుత చెరువులో మునిగిపోతున్న 16 ఏళ్ల బాలుడిని నేత్రావతి కాపాడింది. అయితే పదేళ్ల వయసున్న మరో బాలుడిని రక్షించే క్రమంలో అతనితో పాటు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరణానంతరం ఆమెను గీతా చోప్రా అవార్డుకు ఎంపిక చేశారు. ఏడవ తరగతి తర్వాత చదువుకు స్వస్తి పలికిన నేత్రావతి ఇంటి వద్ద తన సోదరుల ఆలనా పాలనా చూస్తున్నారు.

 

కరణ్ బీర్ సింగ్:
పంజాబ్‌లోని అమృత్‌సర్ నగరానికి సమీపంలోని గాగువాల్‌ గ్రామానికి చెందిన 12 ఏళ్ల కరణ్‌బీర్ సింగ్‌ది మరో సాహసగాధ. ఒకరోజు అతను ప్రయాణిస్తున్న స్కూలు బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. బస్సు వేగంగా నీటిలో మునిగిపోతుంది... ఆలస్యం చేస్తే చాలా మంది ప్రాణాలు కోల్పోతారని గ్రహించిన కరణ్.. వెంటనే తన సోదరితో సహా తోటి వారిని బయటకు లాగి వారి ప్రాణాలను కాపాడాడు. ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది విద్యార్ధులు చనిపోయారు

 

ఎఫ్ లాల్‌చంద్మా:
తన స్నేహితుల్ని కాపాడే ప్రయత్నంలో లాల్‌చంద్మా ప్రాణాలు కోల్పోయారు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి పరీక్షలు రాసి వస్తూ పక్కనే ఉన్న ట్లావుంగ్ నదికి వెళ్లాడు లాల్‌. అయితే అనుకోకుండా వారు నదిలో పడిపోవడంతో లాల్‌చంద్ నీటిలో దూకి ప్రవాహాంలో కొట్టుకుపోయాడు. గాలింపు చర్యల తర్వాత వీరి మృతదేహాలు కనుగొనబడ్డాయి. చిన్నప్పటి నుంచి కార్డియాలజిస్ట్‌ కావాలన్నది లాల్‌చంద్ కల.

 

బెస్త్వాజాన్ పీలాంగ్:

పశ్చిమ ఖాసీ కనుమలకు దగ్గరలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన పీలాంగ్ తన తమ్ముడిని అగ్నిప్రమాదం బారి నుంచి రక్షించాడు. ఒకరోజు వంటగదిలో అన్నదమ్ములిద్దరూ ఉండగా ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. చూస్తుండగానే అగ్నికీలలు ఇంటి పైకప్పును తాకాయి. పైకప్పు ఊడిపోయి తమ్ముడి మీద పడిపోతుండగా దానికి అడ్డుపడి సోదరుడిని బయటకు విసిరేశాడు పీలాంగ్.

 

మమతా దాలై:

గతేడాది ఏప్రిల్‌లో ఒడిషాలోని కేంద్రపారా జిల్లాలో 6 సంవత్సరాల మమతా దాలై తన స్నేహితురాలు అశాంతితో కలిసి చెరువులో స్నానానికి వెళ్లింది. ఇద్దరు స్నానం చేస్తుండగా ఒక మొసలి అశాంతిపై దాడి చేసింది. ఈ సమయంలో తన ప్రాణాలను తాను రక్షించుకోవడానికి బదులుగా మొసలి పట్టు నుంచి స్నేహితురాలిని కాపాడేందుకు పోరాడి ఆమె ప్రాణాలను రక్షించింది.

 

సెబాస్టియన్ విన్సెంట్:
కేరళలోని అల్లెప్పీకి చెందిన సెబాస్టియన్ విన్సెంట్ తన స్నేహితుడు అభిజిత్‌తో కలిసి సైకిల్‌ మీద రైల్వే ట్రాక్‌పై వెళుతుండగా.. అభిజిత్‌ కిందపడిపోయి.. లేచి నడవలేకపోయాడు.. దూరం నుంచి రైలు వస్తోన్న శబ్ధం.. కానీ అభిజిత్ ‌లేవలేకపోతున్నాడు. రైలు అతి దగ్గరకు వచ్చేస్తోంది.. ప్రమాదాన్ని పసిగట్టిన విన్సెంట్ వెంటనే మిత్రుడిని పక్కకు లాగి అతన్ని కాపాడాడు.

 

లక్ష్మీ యాదవ్:
చత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌కు చెందిన లక్ష్మీ యాదవ్ ‌తన స్నేహితులతో మాట్లాడుతూ ఉండగా ముగ్గురు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆమెను అపహరించుకుపోయారు. జన సంచారం లేని ప్రాంతంలో లక్ష్మీపై అత్యాచారయత్నానికి పాల్పడుతుండగా.. ఆమె వారి ప్రయత్నాన్ని అడ్డుకుంది. వారిపై పిడిగుద్దులు కురిపించి.. బైక్‌ కీని దూరంగా విసిరేసి.. దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తన మానాన్ని కాపాడుకోవడంలో ఆమె చూపిన అసమాన ధైర్య సాహసాలకు పోలీసులు లక్ష్మీ యాదవ్‌ని అభినందించారు.

 

సమృద్ధి సుశీల్ శర్మ:
గుజరాత్‌కు చెందిన 16 ఏళ్ల సమృద్ధి శర్మ ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ఆగంతకుడు ఇంట్లోకి ప్రవేశించి అపహరించే ప్రయత్నం చేశాడు. మెడపై కత్తి ఉన్నప్పటికీ ఆమె అతని నుంచి తప్పించుకునేందుకు పోరాడింది. ఊహించని ఈ సంఘటనతో ఆ ఉన్మాది కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అయినప్పటికీ ఆమె తన ప్రాణాల కోసం పోరాడింది. ఈ ప్రయత్నంలో సమృద్ధి ఎడమ చేతి ఉంగరం వేలు పూర్తిగా దెబ్బతినగా ఇప్పటి వరకు రెండు సర్జరీలు చేయించుకుంది.

 

జోనున్‌త్లుంగా:
మిజోరమ్‌‌కు చెందిన జోనున్‌త్లుంగా ఎలుగుబంటి దాడి నుంచి తన తండ్రిని రక్షించాడు. ఒక రోజు కూరగాయల కోసం జోనున్ తన తండ్రితో కలిసి దగ్గరలోని అడవికి వెళ్లారు. ఆ సమయంలో ఎలుగుబంటి జోనున్‌ తండ్రిపై దాడి చేసి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఈ సమయంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా జోనున్ తన దగ్గర ఉన్న చిన్న చిన్న.. ఆయుధాలతోనే ఎలుగుబంటితో పోరాడి తన తండ్రిని కాపాడాడు.

 

పంకజ్ సెమ్వాల్:

ఉత్తరాఖండ్‌లోని తెహ్రీకి చెందిన పదహారేళ్ల పంకజ్ సెమ్వాల్ చిరుతపులి బారి నుంచి తన తల్లితో పాటు అక్క, చెల్లి, తమ్ముడిని రక్షించాడు.


చింగై వాంగ్సా:

నాగాలాండ్‌ మోకోక్చుంగ్ గ్రామానికి చెందిన వాంగ్సా అగ్నికీలల్లో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడాడు.

 

నదాఫ్ ఎజాజ్ అబ్దుల్ రవూఫ్:
మహారాష్ట్రకు చెందిన రవూఫ్ నీటిలో మునిగిపోతున్న మహిళ ప్రాణాలను రక్షించే ప్రయత్నంలో తన ప్రాణాలను కోల్పోయారు.

 

పంకజ్ కుమార్ మహంతా:
ఒడిషాకు చెందిన 15 ఏళ్ల పంకజ్ కుమార్ మహంతా బైతారని నదిలో మునిగిపోతున్న ముగ్గురు మహిళలను రక్షించేందుకు నీటిలోకి దూకి.. వారిని సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చాడు.

 

రాజేశ్వరి చాను:

మిజోరానికి చెందిన రాజేశ్వరి చాను ఇంఫాల్ నదిలో శిధిలమైన వంతెన నుంచి పడిపోయిన తల్లీబిడ్డను రక్షించే ప్రయత్నంలో చనిపోయింది. వంతెన నుంచి జారిపడ్డ తల్లీబిడ్డను కాపాడిన రాజేశ్వరి పైకి వస్తుండగా.. ఒక్కసారిగా గేట్లు తెరవడంతో ప్రవాహాంలో కొట్టుకుపోయింది. ఆమె మరణంపై ఆగ్రహించిన గ్రామస్తులు ఆ వంతెనను తగులబెట్టారు. నేటీకి కూడా అక్కడి ప్రభుత్వం తగులబడిన వంతెన స్థానంలో మరో బ్రిడ్జిని నిర్మించలేదు.


వీరితో పాటుగా నాగాలాండ్‌కు చెందిన మన్షా, శాగ్పోన్ కొన్యాక్, యోక్నీ తదితరులు తమ ధైర్య సాహసాలతో సాహసబాలల అవార్డుకు ఎంపికయ్యారు.