TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మనుసు మార్చుకున్న త్రయంబకేశ్వర ఆలయ పెద్దలు

Published on: Mon Apr 11, 2016 3:48PM

మహారాష్ట్రలోని ప్రఖ్యాత త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి పురుషులు కూడా ప్రవేశించకూడదంటూ ఇటీవల విధించిన నిషేధాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు ఉపసంహరించుకుంది. త్రయంబకేశ్వర ఆలయ గర్భగుడిలోకి తరతరాలుగా మహిళలకు ప్రవేశం నిషిద్ధం. అయితే శనిసింగనాపూర్‌ ఆలయంలోకి మహిళల ప్రవేశం వివాదంలో భూమాతా బ్రిగేడ్ కార్యకర్తలు బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్ధానం వీరి వాదనతో ఏకీభవించింది. ఆలయ ప్రవేశం విషయంలో స్త్రీ, పురుష వివక్ష చూపరాదని..దేవుడిని పూజించడం మహిళల ప్రాథమిక హక్కని..పురుషులతో సమానంగా మహిళలకు దేవాలయాల్లో ప్రవేశించే హక్కు ఉందని వ్యాఖ్యానించింది. శనిసింగనాపూర్ తరహాలో ఇక్కడ మహిళల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు గానూ పురుషులను గర్భగుడిలోకి రాకూడదని ఏప్రిల్ 3న నిషేధం విధించింది.

 

అయితే ఈ నిర్ణయంపై స్థానికులు, పలువురి నుంచి పెద్ద ఎత్తున్న ఒత్తిళ్లు వస్తుండటంతో త్రయంబకేశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సమావేశమైంది. పురుషుల గర్భగుడి ప్రవేశంపై నిషేధాన్ని ఎత్తేస్తూ నిర్ణయం తీసుకుంది. పురుషులపై నిర్ణయం తీసుకుని మహిళలపై మాత్రం ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరి మహిళల నుంచి మహిళా సంఘాల నుంచి దీనిపై ఆందోళనలు వ్యక్తమైతే మళ్లీ ట్రస్ట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.