ముదునూరి ప్రత్యర్థులు చినిమిల్లి, కొత్తపల్లి
Published on: Mon Mar 19, 2012 2:00PM
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాజా మాజీ ముదునూరి రాజుకు ప్రత్యర్ధులుగా కాంగ్రెస్ పార్టీ తరపున కొత్తపల్లి సుబ్బారాయుడు, టిడిపి తరపున డాక్టర్ చినిమిల్లి సత్యనారాయరావు నిలబడనున్నారు. టిడిపి తరపున పోటీచేయానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ పార్టీలో మొదట కొంత గందరగోళం ఏర్పడింది. అయితే నర్సాపురం వైయన్ కళాశాల కరస్పాండెంట్, ప్రముఖ వైద్యుడు సత్యనారాయణ తన వైద్య సేవలతో ఈ ప్రాంత ప్రజలను ఆకట్టుకున్నారు. వచ్చేవారం నుంచి డాక్టర్ సత్యనారాయణ ప్రచారానికి దిగనున్నట్లు తెలిసింది. అయితే చినిమిల్లి రంగంలోకి దిగినంత మాత్రాన తమకేమీ నష్టం ఉండదని కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ అంటున్నాయి. కానీ టిడిపి అభ్యర్థి చినిమిల్లి, కాంగ్రెస్ అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారాయుడు ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో వారి వోట్లు చీలి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి కొంత కలిసి వస్తుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.


