రాజకీయ జోస్యం చెపుతున్న నరేష్

 

 

నిన్న మొన్నటి వరకు భారతీయజనతా పార్టీవెనక తిరిగిన సినీ నటుడు నరేష్ అకస్మాత్తుగా జ్ఞానోదయం అయినట్లు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు తీసుకొన్నారు. తరువాత సాంప్రదాయ ప్రకారం ‘జగనన్న వస్తేనే రాజన్న రాజ్యం వస్తుందనే’ చిలకపలుకులు కూడా చాలా కరెక్టుగానే పలికారు. ఆ తరువాత తన రాజకీయ పరిజ్ఞానం ప్రదర్శిస్తూ “ఇతర పార్టీలకి చెందిన చాలా మంది రాజకీయ నాయకులు వచ్చే ఎన్నికలలోగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడం ఖాయం’ అని జోస్యంకూడా చెప్పారు.

 

అయితే, ఎన్నికల కాలం అంటేనే కప్పలకి వర్షాకాలంవంటిది. వర్షా కాలంలో కప్పలు బెకబెకమంటూ అటూ ఇటూ దూకడం ఎంత సహజమో, మన రాజకీయ నాయకులు ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి దూకడం కూడా అంతే సహజం. అందువల్ల ఇది చెప్పేందుకు పెద్దగా రాజకీయ పరిజ్ఞానం అవసరం లేదు కనుక నరేష్ చక్కగా చెప్పగలిగాడు. అయితే, మరి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇలాగే చాలామంది నేతలు, ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చంచల్ గూడా జైలు ముందు క్యూలు కడుతున్నట్లు అప్పుడు ఆయన ఇంటిముందు కూడా క్యూలు కట్టేవారు.

 

మరి, వైయస్సార్ కాంగ్రెస్ కూడా ప్రజారాజ్యం పార్టీలాగే కాంగ్రెస్ మహా సాగరంలో కలిసి చిరంజీవిలా పులకించిపోతుందా లేక ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడని నిరూపిస్తుందా అనేది చెప్పగలిగితే బాగుంటుంది. అయినా, నరేష్ వంటి సినిమాజీవికి తెలిసిన రాజకీయాలు మన రాజకీయ నాయకులకి తెలియకనా ఇంకా వేచిచూస్తున్నారు?