2024లోనూ అవిశ్వాసం పెట్టండి..!!

నిన్న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన విషయం తెలిసిందే.. టీడీపీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయం గురించి నిలదీస్తే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ మోడీ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.. అయితే అనంతరం మాట్లాడిన మోడీ విపక్షాలకు దీటైన సమాధానాలు ఇచ్చారు.

 

 

'ఏపీ విభజన చట్టం, ప్రత్యేక ఆర్థిక మద్దతు ప్యాకేజీలో ప్రకటించిన ప్రతి వాగ్దానం అమలు చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కానీ టీడీపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి యూటర్న్‌ తీసుకొంది' అని మోడీ ఏపీ ప్రత్యేకహోదా గురించి సమాధానమిచ్చారు.. అలానే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందించిన మోడీ.. ప్రధాని కుర్చీపై కూర్చోడానికి అంత తొందరెందుకని ప్రశ్నించారు.. ఈ  అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్‌ అధ్యక్షుని అహంకారాన్ని, ప్రధాని కుర్చీని దక్కించుకోవాలన్న ఆతృతను చూపిస్తోందని విమర్శించారు.. ఇది ప్రభుత్వానికి విశ్వాస పరీక్ష కాదని, ప్రధాన ప్రతిపక్షం, దాని మిత్రులుగా భావించే పార్టీల బలపరీక్ష అని వ్యాఖ్యానించారు.. ప్రధాని కుర్చీలో ఎవరు కూర్చోవాలో, ఎవరిని తొలగించాలో 125 కోట్ల మంది దేశ ప్రజలు నిర్ణయిస్తారు.. ఈ అవిశ్వాస తీర్మానం వెనుక కాంగ్రెస్‌ అహంకారం దాగి ఉంది.. దీన్ని తిరస్కరించాలి అన్నారు.. కాంగ్రెస్‌ పార్టీకి భారత ప్రధాన న్యాయమూర్తిపైనా, కేంద్ర ఎన్నికల సంఘంపైనా, ఓటింగ్‌ యంత్రాలపైనా విశ్వాసం లేదు.. తమపై తమకు నమ్మకం లేనివారు ఎవరినీ విశ్వసించరు.. 2024లోనూ ఇలాగే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే బలాన్ని మీకు ఇవ్వాలని భగవంతుడిని నేను ప్రార్థిస్తాను.. మీ అందరికీ నా శుభాకాంక్షలు అని మోడీ వ్యంగ్యంగా అన్నారు.