చంద్రబాబుతో నేను పోటీ పడలేను : మోదీ

 

గుంటూరులో నిర్వహించిన బీజేపీ ప్రజా చైతన్య సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఏమైనా చేస్తారని, కాంగ్రెస్‌తో చేతులు కలపడం అందుకు నిదర్శనమని అన్నారు. తన సొంత ప్రయోజనాల కోసమే మహాకూటమి అనే క్లబ్‌లో చేరారని విమర్శించారు. ‘దేశ అభివృద్ధిని దెబ్బతీసిన వారే అవాస్తవాలు ప్రచారాలు చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఏపీ అభివృద్ధిని మరిచి మోదీ వ్యతిరేక ప్రచారంలో భాగస్వామి అయ్యారు' అన్నారు. 'ఏపీలో మౌలిక వసతులను గొప్పగా మారుస్తామన్నారు. అమరావతిని నిర్మిస్తానని చెప్పి.. కూలిన పార్టీని నిర్మించే పనిలో ఉన్నారు. సన్‌రైజ్‌ రాష్ట్రం చేస్తానని చెప్పి.. నిజంగానే తన సన్(కొడుకు) అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు' అని విమర్శించారు. 

చంద్రబాబు నా కంటే సీనియర్‌ అంటారు గానీ ఆయనకంటూ చెప్పుకునేందుకు ఏమీ లేదు అన్నారు. 'సీనియర్‌ నాయకుడైనందుకు మీకు ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడూ ఇచ్చాను. కొత్త కూటములు జత కట్టడంలో మీరు సీనియర్‌. ఏపీ ప్రజల కలలను నీరుగార్చడంలో మీరు సీనియర్‌. ఎన్నికల్లో ఓడిపోవడంలో మీరు సీనియర్‌. ఆ విషయంలో నేను పోటీ పడలేను' అని ఎద్దేవా చేసారు. 'ప్రజల సంక్షేమాన్ని విస్మరిస్తే మాత్రం మీతో ఏకీభవించను. రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీతో మీరు జట్టు కట్టారు. ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ విముక్త రాష్ట్రం చేయాలని సంకల్పించారు. కానీ మీరు వారితోనే జట్టు కట్టారు. దీన్ని చూస్తుంటే ఎన్టీఆర్‌ ఆత్మ క్షోభిస్తుంటుంది' అన్నారు. చంద్రబాబు నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకే ఇక్కడికి వచ్చా. చంద్రబాబు వరుసగా రెండోసారి అధికారంలోకి ఎప్పుడూ రాలేదని, అందుకే ఓడిపోతానని ఆయనకు భయం పట్టుకుందని మోదీ విమర్శించారు. లోకేష్‌ను రాజకీయంగా నిలదొక్కుకునేలా చేస్తానా? లేదా అని ఆయనకు భయం పట్టుకుందన్నారు. సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకుంటానా లేదా అనే భయం కూడా ఉందన్నారు. నిజాయితీపరుడైన మోదీ అనే సేవకుడిని చూసి బాబు భయపడుతున్నారని అన్నారు.

కేంద్రం నుంచి ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పమంటే.. చంద్రబాబు పారిపోయారని ఎద్దేవా చేశారు. గతంలో ఆయన కేంద్రం నిధులకు లెక్క చూపేవారు కాదు అన్నారు. ఇక్కడ జరిగిన సభలో చిన్న టెంట్‌ మినహా మిగిలిందంతా పార్టీ సొమ్మే. రేపు ఫొటోలను తీయించుకోవడానికి టీడీపీ నాయకులంతా ఢిల్లీ వెళుతున్నారు. అందుకు ప్రజాధనాన్ని వినియోగిస్తున్నారు. చంద్రబాబు ఎవరి ఖర్చులతో ఢిల్లీ వెళ్తున్నారని, ఆందోళనలు చేయడానికి ఎవరి సొమ్ము వాడుతున్నారని మోదీ ప్రశ్నించారు. టీడీపీని కాపాడుకునేందుకు ఏపీ జనం సొమ్ము ధారపోస్తున్నారంటూ విమర్శించారు. ఇదే వారికీ మనకు ఉన్న వ్యత్యాసం. నన్ను తిట్టడం మానేసి ఎక్కడి నుంచి ఈ సొమ్ము వినియోగిస్తున్నామో ప్రజలకు చెప్పండి అని మోదీ నిలదీశారు.

చంద్రబాబు, లోకేష్ మీడియా సమావేశాల్లో ఏవేవో మాట్లాడుతున్నారని, తాను గమనిస్తూ వచ్చానని అన్నారు. ఎవరేంటో ప్రజలే చెబుతారన్నారు. నిజంగానే తాము ఏపీకి ద్రోహం చేసి ఉంటే.. ఈ సభకు ఇంతమంది జనం వచ్చేవారా? అంటూ మోదీ ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్ని రాజకీయ జిమ్మిక్కులు చేసినా.. ప్రజలు నమ్మడం లేదని, ఈ జనసందోహం చూస్తే అర్థమవుతోందని మోదీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడం ఖాయమైపోయిందని, తండ్రీ కొడుకుల సర్కార్‌ కూలిపోతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనం కోరుకుంటున్న మార్పు ఈ ఎన్నికల తర్వాత వస్తుందని చెబుతూ.. మోదీ జై ఆంధ్రా నినాదంతో ప్రసంగం ముగించారు.