మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించిన బీజేపీ

 

కొద్ది సేపటి క్రితం డిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటించింది. ఇంతకాలంగా నరేంద్ర మోడీని తమ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడానికి వెనకాడుతున్నబీజేపీని, “తనకు ప్రధాని పదవిపై ఆశలేదని, 2017 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒక చిన్న ప్రకటనతో, కేవలం పది రోజుల్లోనే పార్టీచేత ప్రధాని మంత్రి అభ్యర్ధిగా ప్రకటింపజేసుకోవడం ఆయన రాజకీయ చతురతకి ఒక చిన్న నిదర్శనం అయితే, ప్రధాని పదవిపై ఆశలేదని చెప్పడం ద్వారానే ఆయన ప్రధాని అభ్యర్ధిగా ఎంపిక అవడం మరో విశేషం.

 

ఇక గత ఆరేడు నెలలుగా పార్టీలో తన అభ్యర్దిత్వంపై జరుగుతున్న వాదోపవాదాలకు ఆయనే స్వయంగా చొరవ తీసుకొని ఒక చిన్న ఉపాయంతో ఇంత తేలికగా తెర దించడం కూడా చెప్పుకోవలసిన విశేషమే. అలాగని, ఈ ప్రకటనతో పార్టీలో అద్వానీ వంటి తన వ్యతిరేఖులు చేతులు కట్టుకొని చూస్తూ కూర్చోరని ఆయనకీ తెలుసు. అయితే ప్రధాని పదవి ఆశిస్తున్న వ్యక్తి ఆ మాత్రం పరీక్షలు తట్టుకొని నిలిచి తన నాయకత్వ లక్షణాలను, పోరాట పటిమను కూడా చాటుకోవడానికి ఇటువంటి పరీక్షలు కూడా చాలా అవసరమే.

 

తనను పార్టీ ప్రధాని అభ్యర్ధి గా ప్రకటింపజేసుకోవడంతో ఆయన తొలి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఇక రేపటి నుండి పార్టీలోపల, బయట ఎదురయ్యే విమర్శలకు, పరీక్షలకు ఆయన సిద్ధంగా ఉండక తప్పదు. ముఖ్యంగా రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి చూసుకోవాలని తపిస్తున్నసోనియమ్మకు సైంధవుడిలా అడ్డుపడుతున్నమోడీని సోనియా-రాహుల్ భజన బృంద సభ్యులు ఎన్నటికీ క్షమించలేరు. గనుక రేపటి నుండి మోడీ వారి ఆగ్రహానికి గురికాక తప్పదు. వారు పెట్టే పిల్లి శాపాలను భరించక తప్పదు.