మోడీతో బీజేపీకి లాభనష్టాలు-ఫిఫ్టీ-ఫిఫ్టీ

Publish Date:Sep 9, 2013

Advertisement

 

మోడీ తనకు ప్రధాని పదవిపై ఆశ లేదని, 2017వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగాలనుకొంటున్నాననే ఒకే ఒక చిన్నస్టేట్మెంటుతో ఇంత కాలంగా తన ప్రధాని అభ్యర్ధిత్వాన్నిప్రకటించడానికి వెనుకాడుతున్నబీజేపీని వెంటనే తనకు అనుకూలంగా నిర్ణయం తీసుకొనే విధంగా పరుగులు పెట్టిస్తున్నారు.

 

దీని వల్ల బీజేపీకి లాభము, నష్టము కూడా సరిసమానంగా ఉండవచ్చును. బీజేపీ మోడీ అభ్యర్ధిత్వాన్నిఒకసారి ఖరారు చేయగానే పార్టీలో, బయట ఆయనని వ్యతిరేఖించే శక్తులు అన్నీ ఏకమయ్యే అవకాశముంది. అప్పుడే యుపీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫారూక్ అబ్దుల్లా బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించే ప్రయత్నాలను ఖండిస్తూ, రాహుల్ గాంధీకే ఆ అర్హత ఉందని అన్నారు. మోడీని వ్యతిరేఖిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కాంగ్రెస్ కు మరింత దగ్గర కావచ్చును. అందువల్ల మోడీ ఆలోటును భర్తీ చేసుకొనేందుకు దక్షిణాదిన తెదేపా, అన్నాడీయంకే వంటి కొత్త స్నేహితులను వెతుకోక తప్పదు.

 

అదేవిధంగా, రాహుల్ గాంధీని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలని తపిస్తున్నకాంగ్రెస్ పార్టీ, మోడీని నిలువరించేందుకు తనకు అందుబాటులో ఉన్నప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చును. ఇప్పటికే మోడీని 2002 గోద్రా అల్లర్లతో బలంగా ముడివేసిన కాంగ్రెస్ పార్టీ, గుజరాత్ లో జరిగిన భూటకపు ఎన్కౌంటర్ల కేసుతో మోడీని దెబ్బతీయాలని చూస్తోంది. పనిలోపనిగా బీజేపీలో మోడీకి వ్యతిరేఖ వర్గాన్ని వెనుక నుండి ప్రోత్సహించినా ఆశ్చర్యం లేదు.

 

ప్రధాని పదవిపై ఆశలేదంటూ మోడీ మాట్లాడిన వెంటనే ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా అదేరకమయిన ప్రకటన చేయడం గమనార్హం. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేందుకు అన్ని విధాల తగినవాడని, అతని నాయకత్వంలో పనిచేయడానికి తనకేమి అభ్యంతరం లేదని ప్రకటించడం గమనిస్తే, కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ మార్గం సుగమం చేయడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్ధం అవుతోంది.

 

ఇక బీజేపీ మోడీని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించగానే, ఆయన పారిశ్రామిక, వ్యాపార దృక్పధాన్ని మెచ్చుకొంటున్న దేశంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఆయనకు మద్దతు తెలుపుతారు గనుక అది బీజేపీ విజయావకాశాలను చాల మెరుగు పరుస్తుంది. అదేవిధంగా పార్టీ నిర్ణయంతో ఆయన ద్విగుణీకృత ఉత్సాహంతో, మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలుగుతారు. దేశ ప్రజలపై ముఖ్యంగా ఆయన నాయకత్వాన్ని కోరుకొంటున్న వారిపై ఆ ప్రభావం తప్పకుండా పడి, అది బీజేపీకి మేలు చేకూర్చవచ్చును.