మోడీ ఐడియా ఆయన జీవితాన్నే మార్చేయబోతోందా

 

కొద్ది రోజుల క్రితం, నరేంద్ర మోడీ “తనను గుజరాత్ ప్రజలు 2017వరకు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్నిపాలించమని ఎన్నుకొన్నందున, తాను గుజరాత్ ముఖ్యమంత్రిగానే కొనసాగేందుకే ప్రాధాన్యత ఇస్తానని, ప్రధాన పదవిపై తానెన్నడూ ఆశపడలేదని” అన్నారు. ఆ మాటలు బీజేపీ అగ్ర నాయకత్వంపై బాగానే పనిచేశాయి. మోడీ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ నుండి విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ, మోడీ అకస్మాత్తుగా అస్త్ర సన్యాసం చేసినట్లయితే, అది కాంగ్రెస్ పార్టీకి మరో ఆయుధంగా మారుతుందనే ఆందోళన చెందుతోంది.

 

ఆర్.యస్.యస్. అధినేత మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్, మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ తదితరులు, మోడీ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేఖిస్తున్న అద్వానీ, సుష్మా స్వరాజ్ తదితరులను కలిసి పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మోడీని వ్యతిరేఖించవద్దని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు ఒప్పుకొన్నా లేకున్నాత్వరలో మోడీని పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకే నిశ్చయించుకొన్నారని సమాచారం.

 

ఒకవేళ మోడీని కాదనుకొంటే బీజేపీలో అంత ప్రజాకర్షక నేత మరొకరు లేనందున, అద్వానీ వర్గం ఆయనను వతిరేఖిస్తూనప్పటికీ మోడీనే తమ పార్టీ ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించేందుకు బీజేపీ అగ్రనేతలు కృత నిశ్చయంతో ఉన్నారు. బహుశః మరో వారం పదిరోజుల్లో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.