తెదేపా బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకొంటుందా

 

క్రిందటి నెల గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో ప్రసంగిస్తూ తెదేపా వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుని పొగడ్తలతో ముంచెత్తి, రాష్ట్రం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలనే ఆయన ఆశయాన్ని తెదేపా కూడా అమలుచేస్తే బాగుంటుందని అన్నారు. తాము దేశం నుండి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని చేస్తున్న ప్రయత్నంలో తెదేపా కూడా కలిస్తే బాగుంటుందని ఆయన పరోక్షంగా సూచించారు.

 

తెలంగాణా అంశాన్నినమ్ముకొన్న బీజేపీకి, రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పెద్ద షాక్ ఇవ్వడమే కాకుండా తెరాసను విలీనం చేసుకొని తమపార్టీకి తెలంగాణాలో చోటులేకుండా చేయడంతో మోడీ ఈ ప్రతిపాదన చేసారనుకోవచ్చును. తద్వారా ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో పటిష్టమయిన క్యాడర్స్ ఉన్నతెదేపాతో చేతులు కలిపితే రెండు రాష్ట్రాలలో బలపడవచ్చునని ఆయన ఆలోచన.

 

అంతే గాక, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను అతని జేడీ(యు)ను వదులుకొన్నందున ఆ లోటును తెదేపాతో భర్తీ చేసుకోవచ్చుననే ఆలోచన కూడా ఉంది. ఒకవేళ బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరచగలిగే పరిస్థితి ఏర్పడితే, బీజేపీకి తెదేపా, అన్నాడీయంకే వంటి కొత్త స్నేహితుల మద్దతు చాలా అవసరం ఉంటుందనే ఆలోచనతోనే మోడీ ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

అయితే, మోడీ చేసిన ఈ ప్రతిపాదనకు తెదేపా వెంటనే ఎగిరి గంతేసి తలూపకుండా అలాగని ఖండించకుండా మౌనంగా ఉండి, ఆ ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నట్లు మోడీకి సంకేతం పంపింది. ఇప్పుడు ఆత్మగౌరవ యాత్రలో చంద్రబాబు నాయుడు చెబుతున్నట్లు ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో వైకాపా, తెరాసలు కలిసిపోయినా లేక ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నా, వారినెదుర్కోవడం తేదేపాకు శక్తికి మించిన పని అవుతుంది. అటువంటి పరిస్థితే గనుక ఏర్పడితే తెదేపా బీజేపీతో పొత్తుపెట్టుకోవడం అనివార్యం అవుతుంది.

 

బహుశః దీనిని దృష్టిలో ఉంచుకొనే చంద్రబాబు ఇటీవల ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యులో మోడీ ప్రతిపాదనపై స్పందిస్తూ “ప్రస్తుతం రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇటువంటప్పుడు ఎన్నికల పొత్తుల గురించి మాట్లాడటం సబబుకాదు,” అని చెప్పడం గమనిస్తే బీజేపీతో ఎన్నికల పొత్తులు పెట్టుకోవడాన్ని ఆయన వ్యతిరేఖించడం లేదని అర్ధం అవుతోంది.

 

తెలంగాణాలో బలంగా ఉన్న బీజేపీ వల్ల తేదేపాకు లాభం చేకూరితే, ఆంధ్ర, తెలంగాణా రెండు ప్రాంతాలలో బలంగా ఉన్నతెదేపా వల్ల బీజేపీకి కూడా అంతే లాభం ఉంటుంది. కాంగ్రెస్, వైకాపా, తెరాసలు చేతులు కలిపితే అప్పుడు తెదేపా, బీజేపీలు కూడా చేతులు కలిపే అవకాశం ఉంది.