మెట్రో క్రెడిట్ చంద్రబాబుదా.. వైఎస్‌దా.. కేసీఆర్‌దా

భాగ్యనగర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న హైదరాబాద్ మెట్రో ప్రారంభానికి ఇంకా కొద్ది గంటలు మాత్రమే మిగిలుంది. ఈ నెల 28వ తేదీన భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ హైదరాబాద్ మెట్రోను లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇదే సమయంలో అసలు మెట్రో క్రెడిట్ ఏ ముఖ్యమంత్రి ఖాతాలో వేయాలా అని సోషల్ మీడియా వేదికగా హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదంతా తెలియాలంటే గతంలోకి వెళ్లాలి.. ఇరుకు రోడ్లు, అస్తవ్యవస్తమైన రవాణా వ్యవస్థ ఉన్న హైదరాబాద్‌లో ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్లాలంటే ఎన్ని గంటలు పడుతుందో తెలియదు. ఈ సమస్య నుంచి ప్రజలను గట్టెక్కించడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టి రైల్వే సహకారంతో అత్యంత వేగంగా పూర్తి చేశారు.

 

ఫలక్‌నూమా-సికింద్రాబాద్, ఫలక్‌నూమా-లింగంపల్లి, హైదరాబాద్-ఫలక్‌నూమా, హైదరాబాద్-లింగంపల్లి స్టేషన్ల మధ్య 43 కిలోమీటర్ల పరిధీలో దీనిని ఏర్పాటు చేశారు. అతి తక్కువకాలంలో ఎంఎంటీఎస్‌ ప్రజలకు బాగా చేరువైంది. అయితే పెరుగుతున్న నగర జనాభా, అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్న సాఫ్ట్‌వేర్ బూమ్‌తో ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలకు నగరం చిరునామాగా మారింది. ఈ నేపథ్యంలో టెక్కీలు వేగంగా తమ కార్యాలయాలకు ఏ వైపు నుంచి ఏ వైపుకైనా చేరుకోవడానికి వీలుగా కొత్తగా ఏమైనా చేయ్యాలని సీఎం ఆలోచించారు.

 

ఆ దిశలో కోల్‌కతా, ఢిల్లీ మెట్రోల స్పూర్తితో భాగ్యనగరంలోనూ మెట్రోను తీసుకురావాలని చంద్రబాబు సంకల్పించారు. దీనిలో భాగంగానే హైదరాబాద్ మెట్రో ఆలోచన పుట్టింది.. ఆ వెంటనే కేంద్రప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపారు.. దీనికి కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ నుంచి ఆమోదం లభించింది. స్థల సేకరణ, నిధుల కేటాయింపు తదితర అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు చంద్రబాబు. అయితే 2004లో జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత వైఎస్ హైదరాబాద్ మెట్రోకి శంకుస్థాప చేసి.. కేంద్రాన్ని ఒప్పించి మరీ ముఖ్యమైన అనుమతులు సంపాదించి పనులను పరుగులు పెట్టించారు. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో మెట్రో పనులు ఆలస్యమయ్యాయి. ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి కూడా మెట్రోను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు.

 

రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్ తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ఏర్పాటయ్యాక మెట్రో అలైన్‌మెంట్‌ మార్పుపై పెద్ద దుమారం రేగింది. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాల పరిరక్షణ కోసం అలైన్‌మెంట్ మార్చి తీరుతామని చంద్రశేఖర్ రావు ప్రకటించడంతో రేగిన వివాదం ఎన్నో మలుపులు తీరిగింది. ప్రభుత్వం మార్పులు సూచించిన మూడు మార్గాల్లో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వెంటనే పనులను నిలిపేసి నెలలు గడిచినా సర్కార్ ఈ అంశంపై నిర్మాణ సంస్థకు అధికారిక ఆదేశాలు జారీ చేయలేదు. అందువల్ల ఎల్ అండ్ టీ సంస్థ మెట్రోని తాత్కాలికంగా నిలిపివేయబోతుందంటూ వార్తలు వచ్చాయి.

 

దీంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి ఎన్ని అడ్డంకులు ఎదురైనా మెట్రోని ఆపే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎలైన్‌మెంట్ మార్చి తొలి దశను అందుబాటులోకి తీసుకువచ్చారు. మరి ఈ మెట్రో క్రెడిట్‌ను ఏ సీఎం ఖాతాలో వెయ్యాలి.. నిజానికి రాజకీయాల్లో పనులు ఎవరి హయాంలో శంకుస్థాపన జరిగినా అంతిమంగా ఎవరి చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ అవుతాయో ఆ క్రెడిట్ అంతా వారి ఖాతాలోకే వెళ్లపోతుందన్నది బేసిక్ ప్రిన్సిపల్.. దీనిని బట్టి మీరే ఒక అంచనాకి వచ్చేయొచ్చు.